ప్రజలను కరోనా భయం వెంటాడుతునే ఉంది. కోవిడ్-19 ప్రజల ఆహారపు అలవాట్లను మార్చేసింది. కచ్చితంగా భోజనం విషయంలో కొన్ని నిబంధనలు పాటించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కోవిడ్-19 వైరస్‌ను ఎదుర్కొవాలంటే బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. ప్రతి రోజూ గుడ్లు ఆహారంలో భాగంగా తీసుకోవాలని డాక్టర్లు సిఫారసు చేస్తున్నారు. దీంతో కరోనా మహమ్మారి ప్రజలు సాధారణ రోజుల కంటే ఎక్కువ గుడ్లు తినేలా చేసింది.
తెలంగాణలో కోడిగుడ్ల వాడకం చాలా బాగా పెరిగిందని తాజా గణాంకాల్లో వెల్లడైంది. గతంలో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 1.8 లక్షల గుడ్లు అమ్ముడవుతుండగా ప్రస్తుత కరోనా కాలంలో ఆ సంఖ్య 2 కోట్లకు చేరిందట. దీంతో కోడిగుడ్ల వాడకంలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉందని అధికారులు తెలిపారు. కరోనా నుంచి రక్షణ పొందేందుకు గుడ్డు బాగా ఉపయోగపడుతుందని ఐసీఎమ్మార్ మార్గదర్శకాల్లో పేర్కొనడంతో వీటికి మంచి డిమాండ్ వచ్చేసింది.
కరోనా కారణంగా ఇటీవల నగరాల నుంచి చాలా మంది సొంత గ్రామాలకు వెళ్లిపోవడంతో అక్కడ గుడ్ల వాడకం పెరిగింది. అలాగే హైదరాబాద్‌లో గతంలో రోజుకు 70 లక్షల గుడ్లు తింటే, ఇప్పుడు 60 లక్షలకు తగ్గిపోయింది. గత జూన్, జులై నెలలో వీటి వాడకం ఎక్కువగా ఉందన్నారు. తక్కువ ధరలో ఎక్కువ పోషకాలు అందించే ఆహారంగా, రోగనిరోధకశక్తిని పెంచే కోడిగుడ్ల వినియోగం పెరిగిపోతుంది. ప్రస్తుతం డిమాండ్‌కు సరిపడా మాంసం, గుడ్లను అందించగలుగుతున్నా ఉత్పత్తిలో మాత్రం పౌల్ట్రీపరిశ్రమ కాస్త వెనుకబడే ఉంది. ఇందులో కోటి గుడ్లు మాత్రమే ఇతర రాష్ర్టాలకు ఎగుమతి అవుతున్నాయి. తలసరి గుడ్ల వినియోగంలో దేశంలోనే తెలంగాణ ముందువరుసలో నిలిచింది.