తెలంగాణా ప్రజలు నిజాలు తెలుసుకోవాలి..మంత్రి కేటీఆర్
దుబ్బాక ఎన్నికల వేడిలో బీజేపీకి టీఆర్ఎస్ నేతలు సెగ పుట్టిస్తున్నారు.
దుబ్బాక ఉప ఎన్నికల నేపధ్యంలో బీజేపీ పై తీవ్రంగా విరుచుకుపడుతోంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తెలంగాణాకు తీవ్ర అన్యాయం చేస్తోందంటూ టీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తూ వస్తున్నారు. మంత్రి హరీష్ రావు ఈరోజు ఉదయం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు 18 ప్రశ్నలతో ఓ బహిరంగ లేఖ రాసారు. వాటిలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజీపీ పార్టీ తెలంగాణాకు చేసిన అన్యాయాలను ప్రస్తావించారు. ఇప్పుడు మంత్రి కెటీఆర్ కూడా అదే దారిలో కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే, ఈయన ట్విట్టర్ వేదికగా ఈ విమర్శలు గుప్పించారు.
కేంద్ర ప్రభుత్వం తెలంగాణాకు తీవ్ర అన్యాయం చేస్తోందనీ.. ఈ విషయాన్ని ప్రజలు తెలుసుకోవలసిన అవసరం ఉందనీ అయన ట్వీట్ చేశారు. ''కేంద్ర ప్రభుత్వం తెలంగాణ నుంచి పన్నుల రూపంలో వసూలు చేసే మొత్తంతో పోలిస్తే.. తిరిగి రాష్ట్రానికి విడుదల చేసే మొత్తం తక్కువగా ఉందని అన్నారు. ఈ మేరకు లెక్కలతో కూడిన వివరాలను ఆయన విడుదల చేశారు. భారత ఆర్థిక వృద్దిలో తెలంగాణ గొప్ప పాత్ర పోషిస్తుందని చెప్పారు. "2014 నుంచి మన రాష్ట్రం పన్నుల రూపంలో కేంద్ర ప్రభుత్వానికి 2,72,926 కోట్ల రూపాయల సహకారం అందించిందని.. అయితే కేంద్రం మాత్రం తెలంగాణకు 1,40,329 కోట్లు మాత్రమే విడుదల చేసింది. ఈ విషయం తెలంగాణ ప్రజలు కచ్చితంగా తెలుసుకోవాలి. తెలంగాణ భారతదేశాన్ని బలంగా చేసేందుకు తెలంగాణ ఒక పిల్లర్‌గా కొనసాగుతుంది" అని కేటీఆర్ ఆ ట్వీట్ లో పేర్కొన్నారు.
అదేవిధంగా 2014 నుంచి 2020 వరకు ప్రతి ఏడాది తెలంగాణ నుంచి కేంద్రం ఎంత మొత్తంలో పన్నులు వసూలు చేసింది.. ఆ తర్వాత తెలంగాణకు ఎన్ని రూపాయలు విడుదల చేసిందో తెలిపే ఓ ఫొటోను కూడా కేటీఆర్ ట్విటర్‌లో షేర్ చేశారు. అయితే నేటి సాయంత్రంతో దుబ్బాక ఉప ఎన్నిక ముగియనున్న వేళ కేటీఆర్ ఈ ట్వీట్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా టీఆర్‌ఎస్, బీజేపీలు ఒకరిపై మరోకరు తీవ్ర స్థాయిలో మాటల దాడి చేసుకుంటున్న సంగతి తెలిసిందే. తెలంగాణకు కేంద్రంలోని బీజేపీ అన్యాయం చేసిందని టీఆర్‌ఎస్ నేతలు చెబుతుంటే.. కేంద్రం చేసిన సాయాన్ని సీఎం కేసీఆర్ తన ఖాతాలో వేసుకుంటున్నాడని బీజేపీ నేతలు అంటున్నారు.