సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన
* వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం: కేటీఆర్ * మరిన్ని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏర్పాటు చేస్తా్ం: కేటీఆర్ * నష్టాల్లో ఉన్న విజయ డెయిరీని లాభాల్లోకి తెచ్చాం: కేటీఆర్
రైతులంతా సంఘటితం కావాలనే రాష్ట్రంలో రైతు వేదిక భవనాలు ఏర్పాటు చేశామని తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి రైతు బంధు పథకమే స్ఫూర్తి అన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా గంబీరావుపేటలో పర్యటించిన కేటీఆర్ తన సొంత నిధులతో నానమ్మ, తాతయ్యల పేరిట నిర్మించిన రైతు వేదిక భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రంలో రైతుల జీవితాల్లో గణనీయ ప్రగతి వచ్చిందన్నారు. తెలంగాణ రాకముందు రైతులు సాగునీటి కోసం బోరుబావులపైనే ఆధారపడాల్సిన దుస్థితి ఉండేదని గుర్తు చేశారు. సాగుకు నిరంతర ఉచిత విద్యుత్ అందిస్తూ అన్నదాత జీవితాల్లో సీఎం కేసీఆర్ వెలుగులు నింపారని చెప్పారు.
గంభీరావుపేటలో నూతనంగా నిర్మించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవనం, ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనాన్ని మంత్రి ప్రారంభించారు. గ్రామంలో నిరుద్యోగుల కోసం నిర్మించనున్న అగస్త్య ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కు మంత్రి భూమి పూజ చేశారు. కొత్తపల్లి గ్రామంలో మహిళా సంఘ భవనం, స్మశాన వాటిక, పాఠశాలలో అదనపు తరగతి గదులను ప్రారంభించారు. లింగన్నపేట,మల్లారెడ్డిపేట గ్రామాల్లో నిర్మించిన రైతు వేదికలను కేటీఆర్ ప్రారంభించారు.
కేటీఆర్ కార్యక్రమంలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. కేటీఆర్‌తో చంద్రకళ అనే వృద్ధురాలు సెల్ఫీ దిగారు. ఈ సందర్భంగా కేటీఆర్ ఆమె యోగక్షేమాలు తెలుసుకున్నారు. తనతో మాస్క్ తొలగించి కేటీఆర్ సెల్ఫీ దిగారు. దీంతో ఆ బామ్మ ఆనందానికి అవదుల్లేకుండాపోయాయి.
సిరిసిల్ల ప్రాంతాన్ని ఫుడ్ ప్రాసెసింగ్ హబ్‌గా మార్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. నర్మాల గ్రామంలో రైతు వేదిక ప్రారంభించి.. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌కు శంకుస్థాపన చేశారు. ఈ మెగా ఫుడ్ పార్క్ఖ్ కోసం 260 ఎకరాలు సేకరించామని మరో 4 పరిశ్రమలు తొందర్లోనే వస్తాయని కేటీఆర్ హామీ ఇచ్చారు. మొత్తానికి సిరిసిల్లను మోడల్ నియోజకవర్గంగా మార్చేందుకు మంత్రి కేటీఆర్ సిద్ధమయ్యారు.