KTR on Gift A Smile Program: 'గిఫ్ట్ ఏ స్మైల్' కు స్పందన.. వంద అంబులెన్స్ లకు ప్రణాళిక
KTR on Gift A Smile Program: కేటీఆర్ జన్మదినం సందర్భంగా చేపట్టిన ‘గిఫ్ట్ ఏ స్మైల్’ లో భాగంగా వంద అంబులెన్సులు కొనుగోలు చేసే ప్రక్రియకు రంగం సిద్ధమయ్యింది.
KTR on Gift A Smile Program: కేటీఆర్ జన్మదినం సందర్భంగా చేపట్టిన 'గిఫ్ట్ ఏ స్మైల్' లో భాగంగా వంద అంబులెన్సులు కొనుగోలు చేసే ప్రక్రియకు రంగం సిద్ధమయ్యింది. దీనిలో భాగంగా ఇప్పటికే పలువురు టీఆర్ ఎస్ పార్టీ నాయకులు వీటిని సమకూర్చుతున్నారు. ఈ విధంగా సమకూరిన వాటిని ప్రభుత్వ ఆస్పత్రులకు అందించేందుకు నిర్ణయించారు. వీలైనంత తొందర్లో వీటిని కొనుగోలు చేసి, అందుబాటులోకి తెచ్చేలా కేటీఆర్ తన వంతు ప్రయత్నం చేస్తున్నారు.
సొంత నిధులతో ప్రభుత్వాసుపత్రులకు అంబులెన్సులను సమకూర్చేందుకు పలువురు టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు ముందుకు వచ్చారు. ఈ మేరకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావును ప్రగతిభవన్‌లో కలసి విరాళాల చెక్కులను అందజేశారు. సొంత నిధులతో ఆరు అంబులెన్సులను సమకూరుస్తానంటూ ఇటీవల కేటీఆర్ తన జన్మదినం సందర్భంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు మంత్రులతోపాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా అంబులెన్సులకు నిధులు ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు.
దీంతో మొత్తంగా వంద అంబులెన్సులను సమకూర్చాలని మంత్రి నిర్ణయించారు. ఇందులో భాగంగా సోమవారం ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు (కూకట్‌పల్లి), మనోహర్‌రెడ్డి (పెద్దపల్లి) రెండు చొప్పున, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు ఒకటి, నవీన్‌కుమార్ రెండు చొప్పున అంబులెన్సులు సమకూరుస్తున్నారు. మరో టీఆర్‌ఎస్ నేత మర్రి రాజశేఖర్‌రెడ్డి కూడా ఒక అంబులెన్సుకు సంబంధించిన చెక్కును కేటీఆర్‌కు అందజేశారు. కేటీఆర్ జన్మదినం సందర్భంగా చేపట్టిన 'గిఫ్ట్ ఏ స్మైల్'లో భాగంగా అంబులెన్సు కొనుగోలుకు చెక్కును ఇచ్చినట్లు శంభీపూర్ రాజు వెల్లడించారు.