GPS సిగ్నల్ కోల్పోయి, దారి తప్పి.. ఆకలి, దప్పికలతో తెలంగాణ యువకుడి మృతి
పొట్టకూటి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్తున్న మన వాళ్లు అక్కడి ఎడారుల్లో ఎన్ని ఇబ్బందుల మధ్య ఉద్యోగాలు చేసుకుంటున్నారో తెలిపే కథనం ఇది.
Telangana Man Dies in Saudi Arabia Desert: కరీంనగర్: ఇదొక బాధాకరమైన స్టోరీ. సినిమాల్లోనే తప్ప ఇంతకు ముందెప్పుడూ నిజంగా విననటువంటి రియల్ స్టోరీ. సౌది అరేబియా ఎడారి ప్రాంతంలో తెలంగాణ యువకుడు దారితప్పి తాగడానికి నీళ్లు లేక, తినడానికి తిండి లేక భగభగమండే ఎండలో విలవిలలాడుతూ ప్రాణాలొదిలిన దుర్ఘటన. ఆ యువకుడి పేరు మొహమ్మద్ షేహజాద్ ఖాన్. వయస్సు 27 ఏళ్లు. అతడి స్వస్థలం కరీంనగర్. మూడేళ్ల క్రితం ఉద్యోగం కోసం సౌది అరేబియా వెళ్లాడు. అక్కడే టెలికాం కంపెనీలో పనిచేస్తున్నాడు.
రబ్ అల్ ఖలి ఎడారి. ఇది ఆ ఎడారి పేరు. ఒక అడవి అతిపెద్ద అడవి అని చెప్పడానికి దట్టమైన అడవి, దండకారణ్యం అని ఎలా చెబుతామో... ఇది కూడా అలాగే అతిపెద్ద ఎడారి. ప్రపంచంలో అమేజాన్ అడవులకు ఎలాంటి పేరుందో.. ప్రపంచంలో ఉన్న అన్ని ఎడారుల్లో అతి భయంకరమైన ఎడారిగా రబ్ అల్ ఖలికి కూడా అలాంటి పేరే ఉంది. రబ్ అల్ ఖలి ఎడారి ఎంతపెద్దదంటే.. 650 కిమీ పొడవునా ఈ ఎడారి విస్తరించి ఉంది. దక్షిణ సౌది అరేబియాలో అధిక భాగంలో విస్తరించి ఉండటంతో పాటు పొరుగునే ఉన్న దేశాల్లో సైతం ఈ ఎడారి భాగం ఉంటుంది.
టెలికాం కంపెనీ విధుల నిర్వహణలో భాగంగా మొహమ్మద్ షేహజాద్ ఖాన్ ఆ రబ్ అల్ ఖలి ఎడారిలోకి ప్రవేశించాడు. ఆ సమయంలో అతడి వెంట సుడాన్ దేశస్తుడు కూడా ఉన్నాడు. ఇద్దరూ కలిసి వెళ్తున్న సమయంలోనే జీపీఎస్ సిగ్నల్ ట్రాకింగ్ నిలిచిపోయింది. ఎంత ప్రయత్నించినా జీపీఎస్ సిగ్నల్ దొరకలేదు. అప్పటికే భగభగమండే ఎండలో సమయం గడిచిపోతోంది. మూలిగే నక్కపై తాటి పండు పడిందన్న చందంగా అప్పటికే జీపీఎస్ లొకేషన్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న ఈ ఇద్దరి మొబైల్ ఫోన్లలో బ్యాటరీ కూడా డెడ్ అయింది. దీంతో ఎవరినైనా సహాయం అడిగే అవకాశం కూడా లేకపోయింది. ఒక మనిషి ప్రాణాలతో ఆడుకోవడానికి ఈ మాత్రం చాలదన్నట్లు విధి వారితో మరో డేంజరస్ గేమ్ ఆడుకుంది. అదేంటంటే.. దారి తప్పిన ఆ ఇద్దరు దారిని కనుక్కునేందుకు తిరుగుతున్న క్రమంలోనే వారి వాహనంలో ఇంధనం కూడా అయిపోయింది.
అప్పటికే ఓవైపు నిప్పుల కొలిమిలా భరించలేనంత ఎండ వేడి... దానికితోడు తట్టుకోలేనంత ఆకలి, దాహం, తీవ్రమైన అలసట చుట్టుముట్టడం ఆ ఇద్దరిని నిజంగానే చావు దెబ్బ కొట్టినట్లయింది. దారి కోసం, దాహం కోసం వెతుకుతూ వెతుకుతూ ఆ ఇద్దరూ అదే ఎడారిలో కన్నుమూశారు. వాళ్లు తప్పిపోయిన నాలుగు రోజుల తరువాత గురువారం నాడు ఇసుక కప్పేసినట్లుగా పడి ఉన్న వారి శవాలు కనిపించాయి. వారి ఆచూకీ కోసం వెతుక్కుంటూ వెళ్లిన రెస్క్యూ టీమ్.. వాహనం పక్కనే పడి ఉన్న వారి శవాలను గుర్తించింది. బహుషా ఆ ఇద్దరూ వాహనాన్ని విడిచి ఇంకెక్కడికైనా దూరంగా పోయి ఉంటే.. వారి శవాలపై పూర్తిగా ఇసుక కప్పుకుని పోయి ఉంటే.. ఆ శవాలను గుర్తించడం కూడా కష్టమై ఉండేదేమో!!
అరబ్ దేశాల్లో పని చేసుకుని నాలుగు రాళ్లు వెనకేసుకుందాం అని పొట్ట చేతపట్టుకుని వెళ్తున్న ఎంతోమంది బతుకులు ఎడారిలో గొర్రెలు మేపడంలోనే ఎండిపోతున్నాయి. ఈ టెలికాం కంపెనీ ఉద్యోగుల్లానే ఆ గొర్రెల కాపరుల బతుకులు కూడా మండుటెండల్లో మాడిపోతున్నాయి. ఇటీవల కాలంలో కొంతమంది బాధితులు ఇదే విషయం చెప్పుకుని బోరుమనడం మనం సోషల్ మీడియాలో చూశాం. అంతేకాదు.. గోట్ లైఫ్ అనే మూవీ కూడా ఇదే స్టోరీ లైన్ ఆధారంగా తెరకెక్కి విమర్శకుల ప్రసంసలు అందుకుంది. అక్కడి ఎడారుల్లో, మండుటెండల్లో, మానవమాత్రుడు అనేవాడు కనిపించక ఒంటెల మధ్య ఒంటరి బతుకులు బతుకుతున్న వారి బతుకుచిత్రాన్ని చూపించిన సినిమా అది.