HC Serious on Telangana Government: తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం..
HC Serious on Telangana Government: కరోనా వైరస్ విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు మరోసారి ఆగ్రహించింది.
HC Serious on Telangana Government: కరోనా వైరస్ విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు మరోసారి ఆగ్రహించింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో నేడు సుదీర్ఘ విచారణ కొనసాగుతుంది. ఆస్పత్రుల్లో బెడ్ల సమాచారం ఎందుకు వెల్లడించడం లేదని ప్రశ్నించింది. అధికారులపై కేసు పెట్టి సస్పెండ్ చేయాలని ఎందుకు ఆదేశించకూడదో తెలపాలని అడిగింది. కోర్టు ఆదేశాలు పాటించని అధికారులపై చర్యలు ఎందుకు తీసుకోకూడదని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా న్యాయస్థానం ప్రశ్నించింది. కరోనా టెస్టు విషయంలో పొరుగు రాష్ట్రం ఏపీతో పోలిస్తే తెలంగాణ ఎంతో వెనుకబడి ఉందని న్యాయస్థానం స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను గాలికి వదిలేసిందని ఘాటు వ్యాఖ్యలు చేసింది.
రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుంటే సర్కారు నిద్రపోతుందా అని హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. టెస్టులు, కరోనా హెల్త్ బులిటెన్‌లో సమాచారం అసమగ్రంగా ఉందని వ్యాఖ్యానించింది. పదేపదే ఆదేశిస్తున్నప్పటికీ ఒక్క తీర్పు కూడా అమలు కాకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. తాము పదే పదే ఆదేశాలు జారీ చేస్తున్నా ఖాతరు చేయడం లేదని మండిపడింది. అధికారులు ఉద్దేశపూర్వకంగానే వాస్తవాలు దాచిపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా విషయంలో హైకోర్టు అభినందించిందని బులిటెన్‌లో పేర్కొనడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సమాచారం తెలుసుకోవడం అనేది ప్రజల ప్రాథమిక హక్కు అని పేర్కొంది. ఓ వైపు మొట్టి కాయలు వేస్తుంటే అభినందించామని ప్రజలను ఎలా తప్పుదోవ పట్టిస్తారని ప్రభుత్వాన్ని నిలదీసింది.