High Court on Osmania Hospital Building: ఉస్మానియా ఆస్పత్రిపై హై కోర్టులో విచారణ
High Court on Osmania Hospital Building:పేదవారి పెద్దాసుపత్రిగా పేరు పొందిన ఉస్మానియా జనరల్ ఆస్పత్రి కట్టడం పురావస్తు భవనమా? కాదా? అని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. నిజాం కాలంలో కట్టించిన ఆ ఆస్పత్రి గురించి గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. ఉస్మానియా ఆస్పత్రి పున: నిర్మాణం, కూల్చివేతపై పలు పిటిషన్లు దాఖలవ్వడంతో గురువారం హైకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. ఉస్మానియా ఆస్పత్రి వారసత్వ కట్టడమని ఓ వాదన వినిపిస్తుండగా ఆ భవనాన్ని కూల్చివేయాలని మరో వాదన వస్తోందని తెలిపింది. ఆ భవనం కూల్చివేతపై ఇన్ని భిన్నాభిప్రాయాలు వినిపించడంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ఏజీని ఆదేశించింది.
కాగా గతంలోనే రూ.6 కోట్లను ఉస్మానియా ఆస్పత్రి మరమ్మతుల కోసం కేటాయించినట్లు ప్రభుత్వం కోర్టుకు గుర్తు చేసింది. ఇందులో భాగంగానే ప్రభుత్వ తరపున న్యాయవాది మరమ్మతుల పనుల పురోగతిని తెలుసుకుని చెబుతామని కోర్టును కోరారు. దీంతో ధర్మాసనం ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను ఆగస్టు 4కి వాయిదా వేసింది.
ఇక అదే విధంగా తెలంగాణ హై కోర్టు మరో పిటిషన్ ను కూడా విచారణ చేసింది. రాష్ట్రంలో విద్యాహక్కు చట్టం అమలు కావడంలేదని దాఖలైన పిటిషన్‌ను పరిశీలించింది. 2015 నుంచి విద్యాహక్కు చట్టానికి సంబంధించి పలు పిటిషన్‌లు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపింది. ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై (పిల్) విచారణను ఆగస్టు 11కి వాయిదా వేసింది. ఈ చట్టం అమలుపై కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.