హైదరాబాద్‌లో వరద సాయంపై హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. GHMC ఎన్నికల ఫలితాల తర్వాత వరద సాయాన్ని యథావిధిగా కొనసాగించవచ్చని తెలిపింది. వరద సాయం నిలిపివేత రాజ్యాంగ విరుద్ధమన్న పిటిషనర్ వరద సాయం పంపిణీపై 24గంటల్లో ఎస్ఈసీ మాట మార్చారన్నారు. ముందు ఇవ్వొచ్చని, తర్వాత నిలిపివేయాలని ఆదేశాలిచ్చారని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు పిటిషనర్. ఎన్నికలకు ముందే వరద సాయం అమల్లోకి వచ్చిందన్న పిటిషనర్ ఇఫ్పుడు దాన్ని ఆపడం వల్ల రాజకీయ అజెండా అవుతుందన్నారు. దాంతో, ఎస్ఈసీ అండ్ ప్రభుత్వానికి పలు ప్రశ్నలు హైకోర్టు సంధించింది.
వరద సాయంపై ప్రభుత్వాన్ని ఎందుకు సంప్రదించారని ఎస్ఈసీని నిలదీసిన హైకోర్టు ఎస్ఈసీ స్వతంత్ర వ్యవస్థా లేక ప్రభుత్వం కింద పనిచేస్తుందా? అంటూ ప్రశ్నించింది. అయినా, GHMC ఎన్నికల్లో కేంద్ర ఎన్నికల సంఘం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వర్తిస్తుందా?, బాధితులకు సహాయం ఆపకూడదని కోడ్‌లో ఉందా? అంటూ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు వివరణ కోరింది. అయితే, వరద సాయంపై ఆరోపణలు వచ్చాయని, అందుకే ఆపామని కోర్టుకు తెలిపారు ఎస్ఈసీ. వరద సాయం పంపిణీ పక్కదారి పట్టిందని తెలిపిన ఎలక్షన్ కమిషన్ సాయాన్ని కొనసాగిస్తే ఓటర్లపై ప్రభావం పడుతుందన్నారు ఎస్ఈసీ. దాంతో, డిసెంబర్ 4న కౌంటర్ దాఖలు చేయాలని ఏజీని హైకోర్టు ఆదేశించింది.