Jani Master: జానీ మాస్టర్ కు బెయిల్ మంజూరు చేసిన తెలంగాణ హైకోర్టు

Jani Master: జానీ మాస్టర్ కు తెలంగాణ హైకోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది.

Update: 2024-10-24 07:07 GMT

Jani Master

జానీ మాస్టర్ కు తెలంగాణ హైకోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ అరెస్టయ్యారు. నాలుగు వారాలుగా ఆయన చంచల్ గూడ జైల్లోనే ఆయన ఉన్నారు. తన వద్ద పనిచేసిన మహిళా కొరియోగ్రాఫర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని నార్సింగి పోలీస్ స్టేషన్ లో సెప్టెంబర్ 15న ఫిర్యాదు చేశారు.

ఈ ఫిర్యాదు ఆధారంగా జానీ మాస్టర్ ను పోలీసులు సెప్టెంబర్ 19న గోవాలో అరెస్ట్ చేశారు. సెప్టెంబర్ 20న హైద్రాబాద్ కు తీసుకు వచ్చారు.  ఈ కేసులో పోలీసులు ఆయనను సెప్టెంబర్ లో నాలుగు రోజుల పాటు కస్టడీకి తీసుకొని విచారించారు.

జానీ మాస్టర్ వద్ద పనిచేసిన మహిళా కొరియోగ్రాఫర్ చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలు తెలుగు సినీ పరిశ్రమలో కలకలం రేపాయి. పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ముందే బాధితురాలు సినీ పరిశ్రమలోని పెద్దలకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ పెద్దలు విచారణ జరుపుతున్నారు.

మధ్యంతర బెయిల్ రద్దు

ఈ నెలలో 6 నుంచి 10 వరకు జానీ మాస్టర్ కు మధ్యంతర బెయిల్ మంజూరైంది. నేషనల్ అవార్డు తీసుకొనేందుకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఆయన కోర్టును కోరారు. అయితే ఫోక్సో కేసు నమోదు కావడంతో నేషనల్ అవార్డు రద్దు చేశారు. దీంతో జానీమాస్టర్ కు ఇచ్చిన మధ్యంతర బెయిల్ ను రద్దు చేయాలని పోలీసులు కోర్టును కోరారు. దీంతో కోర్టు ఆయనకు మంజూరు చేసిన మధ్యంతర బెయిల్ ను రద్దు చేసింది.

హైకోర్టులో బెయిల్ పిటిషన్

మధ్యంతర బెయిల్ పిటిషన్ రద్దు కావడంతో జానీ మాస్టర్ న్యాయవాదులు హైకోర్టులో మరోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత హైకోర్టు జానీ మాస్టర్ కు బెయిల్ మంజూరు చేసింది. ఇందుకు సంబంధించిన ప్రొసీజర్ పూర్తి చేసిన వెంటనే జైలు నుంచి ఆయన విడుదలయ్యే అవకాశం ఉంది.


Tags:    

Similar News