Etela fires on Private Hospiltals: తీరు మారకపోతే చర్యలు తప్పవు.. ప్రైవేట్ ఆస్పత్రులపై ఈటెల ఆగ్రహం
Etela fires on Private Hospiltals: కరోనా వైరస్ చికిత్స విషయంలో ప్రైవేటు ఆస్పత్రుల తీరుపై మంత్రి ఈటల రాజేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Etela fires on Private Hospiltals: కరోనా వైరస్ చికిత్స విషయంలో ప్రైవేటు ఆస్పత్రుల తీరుపై మంత్రి ఈటల రాజేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పలుసార్లు నిబంధనలు ఉల్లంఘించిన సోమాజీగూడలో ఓ కార్పొరేటు ఆస్పత్రికి కరోనా చికిత్స అనుమతులు రద్దు చేసినట్లు గుర్తు చేశారు. కరోనాపై మంగళవారం అధికారులతో సమీక్ష చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనాకు రాష్ట్రమంతా ఒకే వైద్య విధానం ఉండాలని స్పష్టం చేశారు. కరోనా సోకిన రోగులకు అవసరమైన ఆక్సీజన్ నిరంతరం సరఫరా చేస్తున్నామని, రాష్ట్రంలో 10 వేల పడకలకు మెరుగైన విధంగా ఆక్సీజన్ సరఫరా జరుగుతోందని వెల్లడించారు. ఆస్పత్రుల్లో ఆక్సీజన్ అందక కరోనా రోగులు చనిపోయారనే వార్తలు సరికాదని అన్నారు.
కరోనా రోగుల పట్ల అన్యాయంగా ప్రైవేటు ఆస్పత్రులు వ్యవహరిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని మంత్రి హెచ్చరించారు. చిన్న వైద్యానికి రూ.లక్షల బిల్లు వేయడం హేయమైన చర్య అని, ప్రైవేటు ఆస్పత్రుల తీరు మానవత్వానికే కళంకం అని అన్నారు. ఇంత చెప్పినా మారకపోతే ప్రైవేటు ఆస్పత్రులకు ఇచ్చిన అనుమతులను రద్దు చేస్తామని తీవ్ర హెచ్చరిక చేశారు. అనారోగ్య లక్షణాలు కనబడితే ఆస్పత్రికి వెళ్లకుండా ఎవరూ దాచుకోవద్దని అన్నారు. అలాగే .. జలుబు, దగ్గు, జ్వరం లాంటి లక్షణాలు ఉంటే నిర్లక్ష్యం చేయొద్దని ఈటల రాజేందర్ తెలిపారు. వారంతా వెంటనే సమీపంలోని పీహెచ్‌సీలను సంప్రదించాలని సూచించారు. చాలామంది ఊపిరి సమస్యలు తలెత్తేవరకు ఆగుతున్నారని.. ఇది చాలా ప్రమాదమని మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు.
మానవత్వానికి కళంకం..
మానవాళిని భయపెడుతున్న అతి ప్రమాద వైరస్ కరోనా.. కనుక ప్రైవేటు ఆస్పత్రులు వంతుగా ప్రజలకు విశ్వాసం, ధైర్యం ఇవ్వాలని, సాటి మనిషికి ఆపన్న హస్తంఅందించాలని కోరారు. వ్యాపార దృక్పథంతో చూడొద్దని అన్నారు. ప్రభుత్వం కోరిన విధంగా కాకుండా కొన్ని ఆస్పత్రులు అధిక మొత్తంలో డబ్బులు వసూళ్లు చేస్తున్నట్టు మాకు వందల, వేల ఫిర్యాదులు వస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆస్పత్రికి పోగానే రూ.2లక్షలు డిపాజిట్ చేయిండి అనడం.. చికిత్స జరగాలంటే రోజుకు రూ.లక్ష కట్టాలనడం.. 15 రోజులు ఉంటే రూ.15లక్షలు కట్టండి అంటూ వేధింపులకు పాల్పడటం వంటి ఫిర్యాదులు అందాయని, మనిషి చనిపోతే మృతదేహాన్ని అప్పగించడానికి రూ.4లక్షలు కట్టాలని వేధించే పద్ధతి మానవ సమాజానికే ఓ కళంకమని అసహనం వ్యక్తం చేశారు. ఆస్పత్రులు ఇప్పటికైనా .. తమ పద్ధతి మార్చుకోకపోతే... అనుమతులు రద్దు చేస్తామని హెచ్చరించారు. ప్రజలను భయపెట్టి లక్షల కొద్దీ వసూలు చేయడం సరికాదని తీవ్రంగా హెచ్చరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అమెరికాకు చెందిన ప్రముఖ డాక్టర్లు పాల్గొని ఆస్పత్రుల డాక్టర్లకు పలు సూచనలు ఇచ్చారు.