Telangana: గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదలకు సర్వం సిద్ధం
Telangana: TSPSC పాలక మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు
Telangana: ఎప్పుడెప్పడా అంటూ ఎదురు చూస్తున్న తెలంగాణ గ్రూప్-1 నోటిఫికేషన్‌ను విడుదల కానుంది. నిరుద్యోగుల ఎదురుచూపులకు తెలంగాణ పబ్లిక్ సర్విస్ కమీషన్ తీపికబురు అందించనుంది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్విస్ కమిషన్ గ్రూప్-1 పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. నోటిఫికేషన్ జారీ చేసేందుకు చైర్మన్ సహా సభ్యులందరూ సంతకాలు చేశారు. 503 పోస్టులతో కూడిన ప్రకటనను TSPSC విడుదల చేయనుంది. గ్రూప్-1 నోటిఫికేషన్ జారీకి సంబంధించి TSPSC పాలక మండలి కీలక సమావేశం జరిగింది. గతంలో ఆర్థిక శాఖ గ్రూప్-1 కింద అనుమతించిన 503 పోస్టులకు సంబంధించి వివిధ శాఖలు సమర్పించిన ఇండెంట్లను పాలక మండలి పరిశీలించింది. రెండు మూడు రోజుల్లో గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదలు చేసే అవకాశాలున్నాయి.
TSPSC పాలక మండలి కీలక సమావేశంలో రూల్ ఆఫ్ రిజర్వేషన్, సర్వీస్ రూల్స్‌కు సంబంధించిన అంశాలను పరిశీలించారు. రాష్ట్రంలో తొలి నోటిఫికేషన్ కావడంతో ఎలాంటి జాప్యం లేకుండా త్వరగా పోస్టులను భర్తీ చేసే అంశంపై చర్చించారు. భవిష్యత్‌లో న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా ముందస్తుగానే న్యాయ నిపుణులను కమిషన్ సంప్రదించింది. వారు కీలక సూచనలు చేసినట్లుగా తెలుస్తోంది. ఆర్థికశాఖ అనుమతి ఇచ్చిన పోస్టుల్లో జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి, డీఎస్పీ భర్తీకి, వాటి విద్యార్హత, ఎంపిక ప్రక్రియ వేరుగా ఉంది. ఆ పోస్టుల భర్తీకి సిలబస్‌ను నిర్ధారించాల్సి ఉంది. సర్వీస్ రూల్స్‌ను సవరించాలి. అందుకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలి.
ప్రభుత్వం సైతం పూర్తి పరిశీలన అనంతరం మరో రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశముంది. అనంతరం జీవోలకు అనుగుణంగా గ్రూప్-1 ప్రకటనను విడుదల చేయనున్నారు. 503 గ్రూప్-1 పోస్టుల భర్తీని కమిషన్ ఆమోదించింది. గ్రూప్-1 పోస్టులు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక శాఖ ఆమోదించినవే కాక ఇంకొన్ని ఖాళీల భర్తీకి కొన్ని శాఖలు TSPSCని కోరాయి. అయితే కొత్త పోస్టులకు అనుబంధ నోటిఫికేషన్‌ను కమిషన్ ప్రకటిస్తుంది. నోటిఫికేషన్‌కు పోస్టుల పెంపుతో సంబంధం ఉండదు. ప్రకటన వెలువడిన తర్వాత కూడా కొత్త పోస్టులను భర్తీ చేయొచ్చు.
మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నియామకాల్లో ఇంటర్వ్యూలకు స్వస్తి పలికింది. పరీక్షల్లో ఇంటర్వ్యూలకు మార్కులను తగ్గించాలని భావిస్తోంది. ఈ క్రమంలో గ్రూప్1 పరీక్ష మొత్తంగా 900 మార్కులకు, గ్రూప్–2 పరీక్ష మొత్తంగా 600 మార్కులకే ఉండనున్నాయి. ఈ మేరకు నియామక సంస్థలు పరీక్షా విధానానికి సంబంధించిన ప్రక్రియను దాదాపు కొలిక్కి తీసుకువచ్చాయి.
ఉద్యోగ నియామకాల్లో ఇంటర్వ్యూల రద్దుతో పరీక్ష విధానంలో మార్పులు తప్పనిసరిగా మారాయి. అయితే పరీక్షల సిలబస్‌లో మార్పులు అవసరం లేదని నియామక సంస్థలు భావిస్తున్నాయి. ఆయా సామర్థ్యాలకు సంబంధించిన అంశాలను రాతపరీక్షలో చేర్చే ప్రతిపాదన కూడా ఉంది. వీటి పరిశీలన పూర్తయిన వెంటనే గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదలకు మరో రెండు రోజుల్లో గ్రీన్ సిగ్నల్ రానుంది.