Group 1 Mains: గ్రూప్ 1 అభ్యర్థుల ఆందోళనతో గాంధీ భవన్ వద్ద హై టెన్షన్ వాతావరణం
Group 1 mains exams: తెలంగాణ గ్రూప్ 1 అభ్యర్థుల ఆందోళనలతో అశోక్ నగర్‌లో ఉద్రిక్త పరిస్థితులు అలాగే కొనసాగుతున్నాయి. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు వాయిదా వేయడం, జీవో 29 రద్దు వంటి డిమాండ్లతో శుక్రవారం అభ్యర్థులు అశోక్ నగర్‌లో ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ఆందోళనలో పాల్గొన్న అభ్యర్థులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులకు దారితీసిన సంగతి తెలిసిందే.
ఆదివారం కూడా ఉదయం నుండే భారీ సంఖ్యలో గ్రూప్ 1 అభ్యర్థులు అశోక్ నగర్ చేరుకుని ధర్నాకు దిగారు. హాల్ టికెట్స్, ప్లకార్డ్స్ చేతపట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలు చేశారు. ప్రెస్ మీట్ పెట్టి మీడియాతో మాట్లాడబోగా ప్రెస్ మీట్‌కి అనుమతి లేదంటూ పోలీసులు అభ్యర్థులను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, విద్యార్థులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
తాము నిరుద్యోగులకు మేలు జరిగేలా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ శాంతియుతంగానే ఆందోళనలు చేపడుతున్నప్పటికీ పోలీసులే జులుం ప్రదర్శించి పరిస్థితిని ఉద్రిక్తం చేస్తున్నారని ఆందోళనకారులు అభిప్రాయపడ్డారు. రేపటి 21వ తేదీ నుండే గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. దీంతో ప్రభుత్వం ఇంకెప్పుడు స్పందిస్తుందనే టెన్షన్ అభ్యర్థుల్లోనూ అంతకంతకూ పెరిగిపోతోంది.
నిన్న సెక్రటేరియట్ ముట్టడికి పిలుపునిచ్చిన గ్రూప్ 1 అభ్యర్థులు ఇవాళ గాంధీ భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు. మరోవైపు గ్రూప్ 1 అభ్యర్థులను ఎలాగైనే సరే గాంధీ భవన్ వైపు వెళ్లకుండా చూడాలనే లక్ష్యంతో భారీ సంఖ్యలో పోలీసులు మొహరించారు. అశోక్ నగర్ నుండి గాంధీ భవన్ వైపు దారితీసే మార్గాలన్నీ పోలీసులతో నిండిపోయాయి.