జూరాల ప్రాజెక్టు వరదనీటిని పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు తెలంగాణా సర్కారు ప్రణాళిక !
జూరాల ప్రాజెక్టుకు వస్తున్న వరద జలాలను పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం కార్యచరణ సిద్ధం చేస్తోంది. అందకు కావాల్సిన వనరులన్నింటినీ అన్వేశిస్తోంది. ఇందులో భాగంగానే జూరాల బ్యాక్ వాటర్‌ను తరలించేందుకు జోగులాంబ గద్వాల జిల్లాలో పునర్జీవ ప్రాజెక్టు నిర్మాణానికి సన్నహాలు చేస్తోంది. అయితే ఇంత వరకు బాగానే ఉంది. కానీ ప్రాజెక్టు నిర్మాణంలో సర్వం కోల్పోతున్న నిర్వాసితులకు న్యాయం జరగడం లేదన్న అపోహాలు ఇప్పటికీ ఆప్రాజెక్టుపై ప్రభావం చూపుతున్నాయి.
జూరాల ప్రాజెక్టు ఎత్తు పెంచడం ఇప్పట్లో సాధ్యం కాకపోవడంతో, కృష్ణా జలాలను పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గలపై వడివడి అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలం నాగర్‌దొడ్డి గ్రామం దగ్గర పునర్జీవ ప్రాజెక్టు నిర్మించాలని భావించింది. అయితే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం వరద సమయంలో జూరాల బ్యాక్ వాటర్ నీటిని ఎత్తిపోసి.. జలాశయంలో స్టోరేజ్ చేసిన తర్వాత వేసవి కాలంలో తాగునీటికి, ఇతర అవసరాలకు వినియోగించుకోవడం.
ప్రభుత్వ లక్ష్యం మంచిదే అయినా నాగర్‌దొడ్డి గ్రామస్తులు మాత్రం ఈ ప్రాజెక్టును వ్యతిరే కిస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణం ప్రాజెక్టు నిర్మాణం కోసం సర్వం కోల్పోతున్నామంటున్నారు నిర్వాసితులు. అంతేకాదు తమకు ప్రభుత్వం నష్ట పరిహారం కూడా సరిగ్గా ఇవ్వడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరానికి 25లక్షల రూపాయలు చెల్లిస్తేనే ప్రాజెక్టుకు తమ భూములు ఇస్తామంటున్నారు. ప్రస్తుతం గ్రామంలో 272 కుటుంబాలు, వెయ్యికిపైగా జనాభా ఉంది. అయితే సుమారు 3600 ఎకరాల భూమిలో ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టబోతుంది ప్రభుత్వం.
మరోవైపు లాక్‌డౌన్‌కు ముందే నాగర్ దొడ్డి గ్రామానికీ సర్వే నిర్వహించడానికి వచ్చారు ఇంజినీర్లు. దీంతో గ్రామస్తులు తమకు ప్రభుత్వం నష్టపరిహారం ఎంత చెల్లిస్తుందోనని తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అయితే 1990 నుంచి 1993 వరకు 600 ఎకరాల భూమిని నష్టపోయామని అప్పట్లో ఎకరాకు 30 నుంచి 40వేల రూపాయల వరకు నష్టపరిహారం అప్పజెప్పారన్నారు. ఇక గతంలోలాగా ఈ సారి మాత్రం తాము నష్టపోయే అవకాశం లేకుండా వ్యవహరిస్తామంటున్నారు గ్రామస్తులు.
ప్రభుత్వం ప్రాజెక్టులు కడుతూ సస్యశామల చేస్తున్నా అందుకు సహకరిస్తున్న భూ నిర్వాసితులకు సరైన న్యాయం చేయలేకపోతుంది. ఇందుకు ఉదాహరణగా నిలుస్తున్నారు మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల మధ్య నిర్మించిన ఉదండాపూర్ రిజర్వాయర్ల కింద భూములు కోల్పోయిన నిర్వాసితులు. సంవత్సరాలు గుడుస్తున్నా ఇప్పటికీ వారికి న్యాయం జరగడం లేదు. వీళ్లే కాదు రంగసముద్రం రిజర్వాయర్ నిర్వాసితులు సైతం నేటికి న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు.