డ్రగ్స్ వినియోగంపై తెలంగాణ సర్కార్ సీరియస్ యాక్షన్
Drugs Use: డ్రగ్స్ వినియోగంపై తెలంగాణ సర్కార్ సీరియస్ యాక్షన్‌కు రంగం సిద్ధమైంది. ఇప్పటికే దీనికి సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్.
ప్రధానంగా అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న హైదరాబాద్‌ను డ్రగ్స్ కల్చర్ టెన్షన్ పెడుతోంది. ఇప్పటికే పబ్స్, డ్రగ్స్, గంజాయి వంటి అంశాలు భాగ్యనగరాన్ని కుదిపేస్తున్నాయి. దీంతో డ్రగ్స్ వ్యవహారంపై నేరుగా ముఖ్యమంత్రి కేసీఆరే రంగంలోకి దిగారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల వాడకాన్ని కఠినంగా నియంత్రించేందుకు చేపట్టాల్సిన కార్యాచరణ, విధి విధానాలను ఇవాల్టి సదస్సులో చర్చించనున్నారు. పోలీసు శాఖ, ఎక్సైజ్ శాఖ అధికార యంత్రాంగాన్ని మరింత అప్రమత్తం చేయనున్నారు.
మరోవైపు.. డ్రగ్స్ వినియోగంలో దోషులుగా తేలినవారు ఎంతటివారైనా సరే కఠినంగా వ్యవహరించాలని ఇప్పటికే సీఎం.. అధికారులను ఆదేశించారు. దీనికోసం రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి మందితో 'స్పెషల్ నార్కోటిక్ అండ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ కంట్రోల్ సెల్' పోలీసు విభాగాన్ని ఏర్పాటు చేయాలని డీజీపీ మహేందర్ రెడ్డిని ఆదేశించారు. ఈ ప్రత్యేక విభాగం రాష్ట్ర డీజీపీ ఆధ్వర్యంలో, డ్రగ్స్ ను, వ్యవస్థీకృత నేరాలను నియంత్రించేందుకు కఠిన చర్యలు తీసుకోవడం కోసం ప్రత్యేక విధులను నిర్వర్తించనుంది. ఇక.. ఇవాల్టి సదస్సులో డ్రగ్స్ కట్టడికి మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ కనిపిస్తోంది.