తెలంగాణలో జూలై 5 తర్వాతే పాఠశాలలు ప్రారంభం..!
కరోనా నేపథ్యంలో వేసవి సెలవులకు ముందుగానే పాఠశాలలకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం విద్యార్ధులకు పరీక్షలు నిర్వహించకుండానే పై తరగతులకు ప్రమోట్ చేసిన విషయం తెలిసిందే.
కరోనా నేపథ్యంలో వేసవి సెలవులకు ముందుగానే పాఠశాలలకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం విద్యార్ధులకు పరీక్షలు నిర్వహించకుండానే పై తరగతులకు ప్రమోట్ చేసిన విషయం తెలిసిందే. అయితే మరికొద్ది రోజుల్లో 2020-21 విద్యాసంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ విద్యా సంవత్సరాన్ని ఎప్పుడు మొదలుపెట్టాలన్న దానిపై పాఠశాల విద్యాశాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ విషయంపై నిర్ణయం తీసుకునే దిశగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ రోజు ఉపాధ్యాయ ఎమ్మెల్సీలతో సమావేశం కానున్నారు.
అయితే కరోనా ప్రభావం వలన నిలిచిపోయిన పదోతరగతి పరీక్షలు జూన్ 8 న ప్రారంభం అయితే జూలై 5వ తేది వరకు పరీక్షలు జరగనుండటంతో ఆ తర్వాతే పాఠశాలలను తెరవాలని అధికారులు భావిస్తున్నారు. ఒకే సారి అన్ని క్లాసుల వారికి కాకుండా ముందుగా 8,9,10 తరగతులు ప్రారంభించే యోచన చేస్తున్నారు. తరగతులు నడుస్తున్న సమయంలో ఏవూనా భద్రతాపరమైన సమస్యలు, ఇంకా వేరే ఏమైనా సమస్యలు ఎదురైతే ముందుగా వాటిని సరిదిద్దుకుని ఆ తరువాత 6,7 తరగతుల విద్యార్థులను పాఠశాలలోని అనుమతించనున్నారు. ఇదిలా ఉండగా 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు గల ప్రాధమిక పాఠశాలలను మాత్రం మరింత ఆలస్యంగా తెరిచే యోచనలో ఉన్నట్లు అధికారులు ఉన్నట్టు సమాచారం.
విద్యాశాఖ ప్రణాళికలోని వివరాలు ఇలా ఉన్నాయి..
● రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లోనూ థర్మల్ స్క్రీనింగ్ ను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి.
● విద్యార్ధులను పాఠశాలలకు అనుమతించడానికి ముందుగా ఉపాధ్యాయులు విధులకు హాజరై పాఠశాలలోని అన్ని మౌలిక వసతులను, సదుపాయాలను పరిశీలించాలి. ఆ తరువాత పాఠశాలల నిర్వహణకు ప్రణాళికను విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా సిద్ధం చేస్తారు.
●ప్రతి విద్యార్ధి భౌతిక దూరం పాటించే విధంగా ఒక్కో తరగతికి ఒక్కో సమయంలో విరామం ఇవ్వాలి.
●ప్రతీ విద్యార్థి మాస్క్ ఖచ్చితంగా ధరించాలి, పాఠశాలలో శానిటైజర్లను ఏర్పాటు చేయాలి.
● పాఠశాల చివరి బెల్ కొట్టిన అనంతరం విద్యార్థులను అందరినీ ఒకేసారి కాకుండా 5-10 నిమిషాల వ్యవధిని పాటిస్తూ విద్యార్ధులను బయటికి పంపించాలి.
●ముందుగా 8,9,10 తరగతుల విద్యార్ధులకు పాఠాలు మొదలు పెట్టి ఆ తరువాత 6,7 తరగతుల వారిని అనుమతించాలి.
HMTV లైవ్ వార్తలు ఎప్పటికప్పుడు గూగుల్ న్యూస్ లో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి