Telangana: నేడు తెలంగాణ సుపరిపాలన దినోత్సవం..

Telangana:10 జిల్లాలను 33 జిల్లాలకు పెంచిన కేసీఆర్ ప్రభుత్వం..ప్రజలకు మరింత చేరువగా ప్రభుత్వ పరిపాలన

Update: 2023-06-10 04:07 GMT

Telangana: నేడు తెలంగాణ సుపరిపాలన దినోత్సవం..

Telangana: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు 'తెలంగాణ సుపరిపాలన దినోత్సవాన్ని' ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఉదయం 11 గంటల నుంచి హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ కార్యాలయంలో 'తెలంగాణలో పాలనా సంస్కరణలు' అనే అంశంపై సదస్సు నిర్వహించనున్నారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత పాలనా సౌలభ్యంపై ప్రజలకు వివరించేలా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు.

రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ పాలనా స్వరూపాన్ని మార్చివేశారు. ప్రభుత్వ పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేయడం కోసం తెలంగాణ ప్రభుత్వం అత్యంత సాహసోపేతంగా పరిపాలనా సంస్కరణలు అమలు చేసింది. ఏకకాలంలోనే పరిపాలనా విభాగాల పునర్విభజన చేపట్టింది. కొత్త పరిపాలనా విభాగాలను ఏర్పాటు చేసింది. కొత్త జిల్లాలు ఏర్పాటు చేసింది ప్రభుత్వం. 2016 అక్టోబర్ కు ముందు తెలంగాణలో 10 జిల్లాలుండేవి. ఒక్కో జిల్లాలో సగటున 35 లక్షలకు పైగా జనాభా ఉంది. కొన్నిచోట్ల జిల్లా కేంద్రాలకు, కార్యాలయాలకు వెళ్లాలంటే 200 నుంచి 250 కి.మీ.ల దూరం వుండేది. దీంతో జిల్లా కేంద్రాల అధికారులు గ్రామాలకు పోవాలన్నా, ప్రజలు జిల్లా కేంద్రాలకు వెళ్లాలన్నా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనేవారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జిల్లాలు పెరగడంతో పాలన సౌలభ్యం పెరిగింది. జిల్లాల్లో అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండడం పరిపాలనకు ప్రభుత్వానికి సులభమైంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ చట్టం-1974 ప్రకారం తెలంగాణలో మరో 23 కొత్త జిల్లాలను ఏర్పాటు చేసి, జిల్లాల సంఖ్యను 33 వరకు పెంచింది. కొత్త జిల్లాలను 2016 అక్టోబర్ 11న ప్రారంభించారు. రెవెన్యూ డివిజన్ల సంఖ్యను 43 నుంచి 74 వరకు, మండలాల సంఖ్యను 459 నుంచి 612 వరకు, గ్రామ పంచాయతీల సంఖ్యను 12వేల 769 వరకు పెంచింది.

రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఏజెన్సీ, అటవీ ప్రాంతాలు ఉన్నాయి. అటవీ రక్షణ, గిరిజనుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేయడం అధికారులకు మరింత సులవుగా మారింది. పట్టణ ప్రాంత అవసరాలకు తగ్గ కార్యక్రమాలు చేస్తున్నారు. అటవీ శాతం తక్కువున్న జిల్లాల్లో పర్యావరణ సమతుల్యానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఉత్సాహవంతులైన యువ కలెక్టర్లను కొత్త జిల్లాలకు కేటాయించడంతో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా జరుగుతున్నాయి. పోలీసు కమిషనరేట్ల పరిధి, పోలీస్టేషన్ల పరిధి తగ్గడంతో నేర నియంత్రణ, నేర పరిశోధన సులువైంది. నేరం జరిగిన ప్రాంతానికి పోలీసుల త్వరగా చేరుకోగలుగుతున్నారు.

Tags:    

Similar News