అబాసుపాలవుతున్న దళిత బంధు పథకం ..?
Dalit Bandhu Scheme: టీఆర్ఎస్ సర్కార్ లక్ష్యానికి కొందరు ప్రజా ప్రతినిధులు తూట్లు..?
Dalit Bandhu: టీఆర్ఎస్ సర్కార్ లక్ష్యం నీరుగారుతుంది. లబ్ధిదారులకు సర్కార్ ఫలాలు దక్కడం లేదు. సీఎం కేసీఆర్, స్కీములను రూపొందించినా వాటి ప్రయోజనం లేకుండా పోతుంది. తాజాగా దళితులకు చేయూతనిచ్చేందుకు తీసుకొచ్చిన దళిత బంధు పథకం అబాసు పాలవుతుంది. అవును.. స్థానిక నేతల సిఫారసులే పథకం అర్హతకు సర్టిఫికెట్లుగా మారుతున్నాయని పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
దళిత బంధు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఎమ్మెల్యేలకు ఇవ్వడంతో మండలాలు, గ్రామాల్లో ఉండే ప్రజా ప్రతినిధుల పెత్తనం ఎక్కువైపోతుందనే ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు మంత్రుల నుండి కూడా సిఫార్సులు వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. దీంతో ఏం చేయాలో అర్ధంకాక తలలు పట్టుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఓటు బ్యాంకులో భాగంగా తమకు అనుకూలంగా ఉన్న వారికి మాత్రమే పథకం వర్తించేలా ఫైరవీలు చేయడంతో అసలు లబ్ధిదారులకు అన్యాయం జరుగుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి. అంతేకాదు.. ఒక్కో లబ్ధిదారి నుండి లక్ష నుండి రెండు, మూడు లక్షల రూపాయల వరకు బేరం మాట్లాడుకుని స్థానిక నేతలు డబ్బులు దండుకుంటున్నారని బాధితులు గోడు వెల్లబోసుకుంటున్నారు.
ఇక తెలంగాణలో అతిపెద్ద ఆర్థిక సాయం అందించే దళిత బంధు పథకం నీరుగారడంపై ప్రభుత్వం దృష్టి సారించాలని దళితులు వేడుకుంటున్నారు. ప్రభుత్వ పెద్దలు నిఘా పెట్టి అర్హులైన వారికి న్యాయం జరిగేలా చూడాలని కోరుతున్నారు. ఇక దీనిపై ప్రభుత్వ పెద్దలు ఎలా స్పందిస్తారో చూడాలి మరీ.