Sagar By-Poll: ఏకమైన హస్తం పార్టీ నేతలు
Nagarjuna Sagar By-Poll:కాలం కలిసి రానప్పుడే అంతా కలిసి కట్టుగా ఉండాలి.. ఇప్పుడు ఇదే సూత్రాన్ని టీ కాంగ్రెస్ నేతలు పాటిస్తున్నారు.
Nagarjuna Sagar By-Poll: కాలం కలిసి రానప్పుడే అంతా కలిసి కట్టుగా ఉండాలి.. ఇప్పుడు ఇదే సూత్రాన్ని టీ కాంగ్రెస్ నేతలు పాటిస్తున్నారు. సాగర్ ఉప ఎన్నిక పార్టీకి జీవన్మరణ సమస్య కావడంతో గ్రూపులన్నీ ఏకమై ప్రచారం చేస్తున్నాయి. జానారెడ్డిని గెలిపించుకుంటే పార్టీ భవిష్యత్తు ఉంటుందనే భరోసాతో పని చేస్తున్నారు. రాష్ట్ర పార్టీలో పెద్దమనిషి జానారెడ్డి కోసం ఉప్పునిప్పులా ఉండే వర్గాలన్నీ ఏకమై ఆయన గెలుపు కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు.
నాగార్జున సాగర్ బై ఎలక్షన్ వచ్చిన నాటి నుంచే అక్కడి నుంచి బలమైన నేత జానారెడ్డి అని గట్టి ప్రచారం జరిగింది. పలుమార్లు జానారెడ్డి సాగర్ నుంచి ప్రాతినిధ్యం వహించడంతో ఆయన అభ్యర్థిత్వానికే కాంగ్రెస్ అధిష్ఠానవర్గం మొగ్గుచూపింది. అప్పటి వరకు ఉన్న పీసీసీ అధ్యక్షుడి ఎంపిక కార్యక్రమాన్ని కూడా జానారెడ్డి లేఖతో వాయిదా వేసింది. దీంతో హాట్ హాట్ గా సాగిన పీసీసీ ఎంపిక వ్యవహారం కూడా ఒక్కసారిగా చల్లబడింది. పీసీసీ పీఠం కోసం ప్రయత్నం చేసిన కాంగ్రెస్ వర్గాలన్ని తమ ప్రయత్నాలు మానుకుని చల్లబడ్డాయి.
సాగర్ బై ఎలక్షన్ నోటిఫికేషన్ రాగానే జానారెడ్డి అలెర్ట్ అయ్యారు. అధికార టీఆర్ఎస్ పార్టీకి ధీటుగా ప్రచారం చేసుకుంటూ పోయారు. సాగర్ లో సిట్టింగ్ స్థానం దక్కించుకోవడానికి అధికార పార్టీ టీఆర్ఎస్ దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహ్మయ్య కుమారుడు నోముల భగత్ కే చివరి నిమిషంలో టికెట్టు ఇచ్చింది. బీజేపీ కూడా యువకుడైన రవికుమార్ నాయక్ కు అవకాశం ఇచ్చింది. అయితే జానారెడ్డి రాజకీయ సీనియారిటి అంత వయస్సు లేని టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్దులు వారివారి పార్టీ బలంపైనే ఆధారపడ్డారు.
ఇక జానారెడ్డి నియోజకవర్గంలో ఇదివరకే చాలా సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అనుభవం ఉండడంతో.. తన సహజ బలంతో ప్రచారం చేసుకుంటూ పోతున్నారు. ఈసారి సాగర్ ఎన్నికలో కాంగ్రెస్ ఓడితే పార్టీ ఖతమయిందనే ప్రచారాన్ని టీఆర్ఎస్, బీజేపీలు ముమ్మరం చేస్తున్నాయి. ప్రత్యామ్నాయం కోసం కాచుకు కూర్చున్న బీజేపీని తట్టుకొని నిలబడాలి. దీంతో అందరిని సమన్వయం చేసుకున్నారు జానారెడ్డి. తనగెలుపు ఓటములకు పార్టీ ద్వారా వచ్చే కీలక పదవులకు సంబంధం లేదని చెప్పి అన్ని గ్రూపులను తనవైపుకు తిప్పుకున్నాడు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్థానిక సిట్టింగ్ ఎంపీగా ప్రచారం చేస్తున్నారు.. అటు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, భట్టి విక్రమార్క, వీహెచ్, ప్రచారం కొనసాగిస్తున్నారు.
ఇక పీసీసీ పదవి కోసం గట్టిగా పోటీ పడ్డ రేవంత్ రెడ్డి సాగర్ ప్రచారంలోనికి తన వర్గంతో దూకడంతో ఒక్కసారిగా ఊపు వచ్చింది. రేవంత్, జానారెడ్డి కుమారుడు రఘువీర్ మంచి స్నేహితులు కావడము కూడా కలిసి వచ్చింది. అధికార టీఆర్ఎస్ ధీటుగా కాంగ్రెస్ నేతలు గత వారం రోజులుగా ప్రచారం చేస్తోంది. సాగర్లో జానారెడ్డి చేసిని అభివృద్ధిని వివరిస్తున్నారు.. తెలంగాణ రాష్ట్రం కోసం జానారెడ్డి చేసిన కృషి ని తెలుపుతూ ఆయన గెలుపుకోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. సంపత్, జగ్గారెడ్డి సాగర్లో మకాం వేసి ప్రచారం చేస్తున్నారు. చివరకు ఒకగ్రూపుకు మరోగ్రూపుకు పడకున్న ఎవరి ప్రచారం వారు చేస్తున్నారు. ఇటు పీసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మాణిక్కం ఠాగూర్ కూడా రెండురోజుల ప్రచారమ చేస్తున్నారు.
మొత్తానికి ఈ సమయంలో జానారెడ్డి గెలుపు పార్టీకి ఎంత అవసరమో తెలిసొచ్చింది.. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నేతలంతా ఏకమై ఒక్కతాటిపైకి వచ్చారు. అంతర్గతంగా తర్వాత కొట్టుకుందాము కానీ ఇప్పుడు అధికార పార్టీని ఓడించాలనే కసితో ఉన్నారు. సాగర్లో జానారెడ్డి గెలిస్తే పార్టీ బ్రతికి బట్టకడుతుందనే విశ్వాసం కార్యకర్తలకు నాయకులకు వస్తుందనే నమ్మకంతో జానారెడ్డి మాటపై గౌరవంతో ప్రచారం చేస్తున్నారు.