Telangana: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు మాయత్తమవుతోన్న టీకాంగ్రెస్

* ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి ఎజెండాగా ప్రజల్లోకి * ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత గెలిపిస్తుందని ధీమా

Update: 2021-02-15 07:18 GMT

ఉత్తమ్ కుమార్ రెడ్డి (ఫోటో:హాన్స్ ఇండియా)

రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు తెలంగాణ కాంగ్రెస్ సమాయత్తమవుతోంది. ఎట్టి పరిస్థితుల్లో రెండు స్థానాలు కైవసం చేసుకోవాలనే పట్టుదలతో వ్యూహాలు రచిస్తోంది. ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను క్యాష్ చేసుకుంటే.. పార్టీకి పునర్వైభవం వస్తుందని భావిస్తోన్న రాష్ట్రస్థాయి లీడర్లు.. ఆ దిశగా పనిచేయాలని కేడర్‌కు దిశానిర్దేశం చేస్తున్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ మళ్లీ పుంజుకునేందుకు చర్యలు తీసుకుంటోంది. పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతోంది. రెండు ఎమ్మెల్సీ స్థానాలకు త్వరలో జరిగే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హస్తం పార్టీ.. విజయబావుటా ఎగరవేయాలని ఉవ్విళ్లూరుతోంది. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ స్థానానికి రాములు నాయక్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి , హైదరాబాద్ స్థానానికి మాజీ మంత్రి చిన్నారెడ్డిని బరిలో దింపుతోన్న పార్టీ నేతలను సమాయత్తం చేస్తోంది. రెండు స్థానాల్లో అభ్యర్థులను గెలిపించేందుకు పార్టీ శ్రేణులు సిద్ధమవ్వాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు.

అన్ని వర్గాల ప్రజలు టీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేస్తుందన్నారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్. కాంగ్రెస్ హయాంలో ఉద్యోగులకు పీఆర్సీ43 శాతం ఇస్తే.. టీఆర్ఎస్ 7 శాతం ప్రకటించడం సిగ్గుచేటన్నారు. ఉద్యోగాలు భర్తీ చేయకుండా, నిరుద్యోగ భృతి ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేసిందన్నారు. ఇక పల్లా రాజేశ్వర్ రెడ్డి అవినీతి సొమ్ముతో ఓట్లు కొనాలనే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు ఉత్తమ్.

మరోవైపు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలంటే టీఆర్ఎస్ పార్టీకి భయం పట్టుకుందన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. పట్టభద్రులను ఓట్లడిగే హక్కు టీఆర్ఎస్ కు లేదన్నారు. రెండు స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపు ఖాయమని చెబుతున్నారు ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నారెడ్డి.

మొత్తానికి మళ్లీ నిలదొక్కుకోవాలని చూస్తోన్న కాంగ్రెస్‌కు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలైనా కలిసొస్తాయా లేదా చూడాలి మరి. 

Tags:    

Similar News