హస్తినకు చేరిన టీ కాంగ్రెస్ పంచాయితీ
Telangana Congress: ఇవాళ సోనియాతో కాంగ్రెస్ నేతల భేటీ
Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్ పంచాయితీ హస్తినకు చేరింది. ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి వెళ్తున్నారు. కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ టీ కాంగ్రెస్ నేతలకు అపాయింట్ మెంట్ ఇచ్చారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారు. భట్టి విక్రమార్కతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కొందరు సీనియర్ నేతలు సోనియా గాంధీతో భేటీ కానున్నారు.
టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తెలంగాణ కాంగ్రెస్‌లో అసంతృప్తి జ్వాలలు ఎగిసి పడుతున్నాయి. ముందుగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఉన్నా ఆ తరవాత సైడ్ అయిపోయారు. జగ్గారెడ్డి మాత్రం రేవంత్ రెడ్డిపై ఒంటికాలుపై లేస్తున్నారు. రేవంత్‌పై ఏదో సందర్భంలో టార్గెట్ చేస్తూ మాటల తూటాలు పేల్చుతున్నారు. రేవంత్ వల్ల పార్టీకి నష్టమని, అవినీతి పరుడంటూ హాట్ హాట్ కామెంట్స్ చేశారు జగ్గారెడ్డి. రేవంత్ బండారం బయట పెడుతానంటూ జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.
ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నేతలు వరుసగా సమావేశం అవుతున్నారు. రేవంత్ కు వ్యతిరేకంగా భేటీలు జరుపుతున్నారు. తాజాగా జరిగిన సీనియర్ల సమావేశాన్ని రేవంత్ సీరియస్ గా తీసుకున్నారు. ముందస్తు ఎన్నికలు వస్తాయని రేవంత్ మన ఊరు, మన పోరు పేరుతో రాష్ట్రంలో సభలు నిర్వహిస్తూ క్యాడర్‌లో ఉత్సాహం నింపుతున్నారు. ఇదే క్రమంలో కొందరు కాంగ్రెస్ నేతలు అసమ్మతి రాగం వినిపిస్తున్నారు.
అసమ్మతి నేతలను దారికి తీసుకొచ్చే పని మొదలు పెట్టారు రేవంత్. మొదట జగ్గారెడ్డిపై చర్యలకు ఉపక్రమించారు. తనను ఏఐసీసీ బాధ్యతల నుంచి తప్పించాలని గతంలో జగ్గారెడ్డి లేఖ రాశారు. ఈ లేఖను పరిగణలోకి తీసుకుని జగ్గారెడ్డిని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతల నుంచి తప్పించారు. ఖమ్మం , కరీంనగర్, భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గాల బాధ్యతలతో పాటు ఎన్.ఎస్.యూ.ఐ , యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ లాంటి అనుబంధ శాఖల బాధ్యతల నుంచి జగ్గారెడ్డిని తప్పించారు. జగ్గారెడ్డిని బాధ్యతల నుంచి తొలగించడం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది.
ఇక సోనియా సమక్షంలో జరిగే భేటీలో కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు చేసేందుకు రెడీ అయ్యారు. రేవంత్ ఒంటెద్దు పోకడతో వెళ్తున్నారని, సీనియర్లను కలుపుకునిపోవడం లేదని నేతలు కాంగ్రెస్ అధినేత్రికి విన్నవించనున్నారు. కాంగ్రెస్ నేతలతో చర్చించకుండా రేవంత్ నిర్ణయాలు తీసుకుంటున్నారని ఫిర్యాదు చేయనున్నారు. టీపీసీసీ బాధ్యతల నుంచి రేవంత్ ను తప్పించాలని కూడా నేతలు కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సోనియా గాంధీ తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఏం దిశా నిర్దేశం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.