Telangana CM Revanth Reddy returns Rs 100 cr donation to Gautam Adani: గౌతం అదానీ అవినీతికి పాల్పడినట్లుగా అమెరికా కోర్టు చేసిన ఆరోపణలు పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణల తరువాత గౌతం అదానీపై విమర్శలు ఎక్కువయ్యాయి. తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా గౌతం అదానీ విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. గతంలో తెలంగాణ స్కిల్ యూనివర్శిటీ కోసం అదానీ ఇచ్చిన రూ. 100 కోట్ల విరాళం వెనక్కు ఇచ్చేస్తున్నట్లు రేవంత్ రెడ్డి ప్రకటించారు. అదానీ నుంచి రూ.వంద కోట్లు స్వీకరించకూడదని నిర్ణయించుకున్నామని చెప్పారు. ఇదే విషయమై అదానీ సంస్థకు నిన్ననే లేఖ రాసినట్లు రేవంత్ రెడ్డి తెలిపారు.
గౌతం అదానీ నుంచి తెలంగాణ ప్రభుత్వం నిధులు సేకరించినట్టు ప్రచారం జరుగుతుండటాన్ని రేవంత్ రెడ్డి ఖండించారు. ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి పనులకు చట్టబద్ధంగా నిర్వహించే టెండర్లలో అందరికీ సమాన అవకాశం ఉంటుందన్నారు. అలాగే, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ నిర్మాణం కోసం ఎంతోమంది నిధులిచ్చారు. వారిలో ఒకరిగా స్కిల్ యూనివర్సిటీ నిర్మాణం కోసం గౌతం అదానీ కూడా విరాళం అందించారు. అంతకు మించి ఇందులో రాద్ధాంతం చేయడానికి ఏమీ లేదని రేవంత్ రెడ్డి అన్నారు.
రాష్ట్రంలో పెట్టుబడుల విషయంలో ఎవరికి ప్రత్యేకమైన మినహాయింపులు ఉండవు అని సీఎం తెలిపారు. ఆమాటకొస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఎన్నో భూములు కట్టబెట్టారు అని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. గౌతం అదానీకి వంగి వంగి దండం పెట్టింది తాము కాదు.. కేసీఆరేనని ఆయన బీఆర్ఎస్ శ్రేణుల విమర్శలకు కౌంటర్ ఇచ్చారు.