KCR Yadadri Tour: ఇవాళ యాదాద్రికి సీఎం కేసీఆర్

* శ్రీలక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోనున్న సీఎం * అనంతరం యాదాద్రి ఆలయ అభివృద్ధి పనుల పరిశీలన

Update: 2021-09-14 01:45 GMT

శ్రీలక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోనున్న సీఎం కేసీఆర్ (ఫోటో: ది హన్స్ ఇండియా)

KCR Yadadri Tour: ఇవాళ సీఎం కేసీఆర్‌ యాదాద్రిలో పర్యటించనున్నారు. ముందుగా శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారిని ఆయన దర్శించుకోనున్నారు. అనంతరం.. యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులను కేసీఆర్‌ పరిశీలిస్తారు. ఈ ఏడాది అక్టోబర్ లేదా నవంబర్ నెలలో యాదాద్రి పుణ్యక్షేత్రం ప్రారంభోత్సవం జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆలయ పునర్నిర్మాణ పనులు ఎంతవరకు వచ్చాయనే అంశాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకోనున్నారు.

కొద్ది రోజుల క్రితం ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీతో భేటీ అయిన కేసీఆర్ యాదాద్రి ఆలయ ప్రారంభోత్సవానికి ప్రధాని మోడీని ఆహ్వానించారు. దానికి మోడీ కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. దీంతో భారీ ఎత్తున ఏర్పాట్లు చేయాలని కేసీఆర్ అధికారులను ఆదేశించనున్నట్టు సమాచారం. ఇప్పటికే యాదాద్రి ఆలయ నిర్మాణాలు తుది దశకు చేరుకున్నాయి. కొండపై నిర్మాణ పనులు ఇప్పటికే ఓ కొలిక్కి రాగా గుట్ట దిగువున కొన్ని ప్రధాన పనులు ఇంకా కొనసాగుతున్నాయి. భక్తులు పుణ్య స్నానమాచరించేందుకు కొండ కింద గండిచెరువు పక్కనే పుష్కరిణి నిర్మాణం కూడా పూర్తయింది.

మొత్తానికి అక్టోబర్‌ నాటికి యాదాద్రి ఆలయ నిర్మాణ పనులు పూర్తయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఆలయాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారనేది మాత్రం సీఎం కేసీఆర్‌ యాదాద్రి పర్యటన తర్వాతే క్లారిటీ రానుంది. యాదాద్రి పర్యటన అనంతరం చినజీయర్‌ స్వామితో చర్చించి, యాదాద్రి ఆలయ ప్రారంభోత్సవంపై నిర్ణయం తీసుకోనున్నారు సీఎం కేసీఆర్.

Tags:    

Similar News