Telangana CM KCR: 'సీమ' ఎత్తిపోతలు సక్రమం కాదు..
Telangana CM KCR: ఏపీ ప్రభుత్వం చేపడుతున్న రాయలసీమ ఎత్తిపోతలు సక్రమం కాదని అక్రమమేనని తెలంగాణా సీఎం పేర్కొన్నారు.
Telangana CM KCR: ఏపీ ప్రభుత్వం చేపడుతున్న రాయలసీమ ఎత్తిపోతలు సక్రమం కాదని అక్రమమేనని తెలంగాణా సీఎం పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఎటువంటి అనుమతులు, కేటాయింపులు లేకున్నా ఏపీ ప్రభుత్వం తెగపడుతుందని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన పోతిరెడ్డిపాడు సామర్థ్య పెంపుతోపాటు కొత్తగా నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం ముమ్మాటికీ అక్రమమేనని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పునరుద్ఘాటించారు. ఈ నెల 25న జరుగనున్న రెండో అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో వీటిపై గట్టిగా అభ్యంతరం చెప్పాలని నిర్ణయించారు. నీటి కేటాయింపులు, అనుమతులు లేకున్నా, ట్రిబ్యునల్ అవార్డుకు భిన్నంగా గోదావరి, కృష్ణానదుల్లో ఏపీ అక్రమంగా వాడుకుంటున్న నీటి విషయంపై కూడా సమావేశంలో నిలదీస్తామని స్పష్టంచేశారు.
వీటికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని, అవసరమైన డాక్యుమెంట్లను సిద్ధంచేయాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వంగానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంగానీ తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో వ్యక్తంచేసిన అభ్యంతరాలన్నీ అర్థంపర్థంలేనివే అని ఆయన స్పష్టంచేశారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహం ఖరారుచేసేందుకు సీఎం కేసీఆర్ బుధవారం ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు. రెండో అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. కేంద్రం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేవనెత్తిన సందేహాలన్నింటినీ నివృత్తి చేస్తామని చెప్పారు. నదీజలాల వినియోగం విషయంలో తెలంగాణకు ఉన్న అభ్యంతరాలను కూడా కౌన్సిల్ సమావేశంలో లేవనెత్తుతామని వెల్లడించారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశం విషయంలో తమ సంసిద్ధతను వ్యక్తంచేస్తూ కేంద్రానికి లేఖ రాయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అజెండాలో చేర్చాల్సిన అంశాలనూ ఆ లేఖలో పేర్కొంటామని చెప్పారు.
తెలంగాణలో అన్నీ పాత ప్రాజెక్టులే
తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులపై కేంద్రం, ఏపీ ప్రభుత్వం లేవనెత్తిన అన్ని సందేహాలను కౌన్సిల్ సమావేశంలో నివృత్తి చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఇందుకు సమగ్ర సమాచారం సిద్ధంచేయాలని అధికారులను ఆదేశించారు. వాస్తవానికి తెలంగాణలో కొత్త ప్రాజెక్టులేవీ చేపట్టలేదని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టిన ప్రాజెక్టులనే తెలంగాణ అవసరాలను తీర్చేలా రీడిజైన్ చేశామని ఆయన చెప్పారు. ఇదే విషయాన్ని ఆధారాలతో సహా కౌన్సిల్ సమావేశంలో చెప్పాలని నిర్ణయించారు. ఆయా ప్రాజెక్టులు ఎప్పుడు మంజూరయ్యాయి? ఎన్ని నిధులు కేటాయించారు? తెలంగాణ వచ్చేనాటికి ఎంత ఖర్చుచేశారు? ఎంత భూమి సేకరించారు? ఎన్ని టీఎంసీలు కేటాయించారు? తదితర వివరాలను సిద్ధంచేయాలని అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టుల నిర్మాణం, నీటి వాడకానికి సంబంధించి బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిన అవార్డుకు అనుగుణంగానే తెలంగాణ వ్యవహరిస్తున్నదనే విషయాన్ని ఆధారసహితంగా వివరించాలని తెలిపారు.
నదీజలాల వినియోగం విషయంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై గతంలో అనేకసార్లు ఫిర్యాదు చేశామని, ఈసారి జరిగే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలోనైనా ఆ అంశాలను చేర్చి, న్యాయం చేయాల్సిందిగా కోరుతామని సీఎం కేసీఆర్ చెప్పారు. ఈ సమీక్షలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, జల వనరులశాఖ సలహాదారు ఎస్కే జోషి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ సుభాశ్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, జల వనరులశాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్, సీఎం ముఖ్య కార్యదర్శి ఎస్ నర్సింగ్‌రావు, ఈఎన్సీ నాగేందర్‌రావు, అధికారులు కోటేశ్వర్‌రావు, ప్రసాద్, విజయ్‌కుమార్, వెంకటనారాయణ, సీనియర్ అడ్వకేట్ రవీందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.