CM KCR Phone Conversation with Farmer: రైతులకు ఫోన్లు చేసిన సీఎం కేసీఆర్..
CM KCR Phone Conversation with Farmer: తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది రైతులు శ్రీరాంసాగర్ పునర్జీవ పథకం కింద లబ్ధిపొందారు.
CM KCR Phone Conversation with Farmer: తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది రైతులు శ్రీరాంసాగర్ పునర్జీవ పథకం కింద లబ్ధిపొందారు. ఈ సాగర్ నుంచి వస్తున్న నీటితో 34 తూముల ద్వారా చెరువులను నింపుతున్నారు. 122 కిలోమీటర్ల పొడవున్న వరద కాలువను నాలుగు రిజర్వాయర్లుగా చేసారు. ఈ విధంగా నీటిని అందించడం ద్వారా వరద కాలువ దిగువ భూములకు తూముల ద్వారా నీళ్లందుతున్నాయి. కాగా ఎగువ గ్రామాలకు కూడా నీళ్లివ్వాలనే విజ్ఞప్తులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ ఆయా సమస్యలపై దృష్టి సారించారు. జగిత్యాల జిల్లా కథలాపూర్ జెడ్పీటీసీ నాగం భూమయ్య, మేడిపల్లి మండల రైతుబంధు సమితి జిల్లా కార్యవర్గసభ్యుడు, వెంకట్రావుపేట మాజీ సర్పంచ్ కాటిపెల్లి శ్రీపాల్‌రెడ్డికి బుధవారం నేరుగా ఫోన్‌చేసి మాట్లాడారు. రైతులకు నీళ్లందుతున్నతీరు, వరదకాలువ ద్వారా ఒనగూరుతున్న ప్రయోజనాలు పరీవాహక ప్రాంతాల రైతుల అవసరాలు ఇతర అంశాలపై సీఎం కేసీఆర్ మాట్లాడారు.
సీఎం అడిగిన ప్రశ్నలకు జెడ్పీటీసీ నాగం భూమయ్య కథలాపూర్‌లోని విషయాలను వివరించారు. వరదకాలువకు ఎగువనున్న మరో 12 గ్రామాలకు లిప్టుద్వారా నీళ్లిస్తే.. ఆ గ్రామాల రైతుల కష్టాలు తీరుతాయని విజ్ఞప్తిచేశారు. పునర్జీవ పథకంతో మండలంలోని బొమ్మెన, కథలాపూర్, తక్కల్లపల్లి, సిరికొండ గ్రామాల ముఖచిత్రం పూర్తిగా మారిపోయిందని, రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారని తెలిపారు. వారు చెప్పిన దానికి సీఎం కేసీఆర్ స్పందిస్తూ ఈ విషయాల గురించి సంపూర్ణంగా మాట్లాడేందుకు రెండు మూడురోజుల్లో హైదరాబాద్ రమ్మని ఆహ్వానించారని జెడ్పీటీసీ తెలిపారు. అనంతరం మేడిపల్లికి మండలం వెంకట్రావుపేట మాజీ సర్పంచ్ శ్రీపాల్‌రెడ్డితోనూ సీఎం కేసీఆర్ ఫోన్లో ముచ్చటించారు.
ఈ సందర్బంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రస్తుతం కాలువ ద్వారా అందుతున్న నీళ్లతో రంగాపూర్, దమ్మన్నపేట, కొండాపూర్, కల్వకోట గ్రామాల రైతులు ఎంతో ఆనందంగా పంటలు పండించుకుంటున్నారన్నారు. కానీ 13 గ్రామాలు ఎగువభాగంలో ఉన్నాయని ఆయా గ్రామాలకు నీళ్లందడం లేదని ముఖ్యమంత్రికి వివరించారు. దీంతో స్పందించిన సీఎం కేసీఆర్ ఎగువ భాగాలకు ఉన్న గ్రామాలకు ఏం చేస్తే నీళ్లు అందుతాయని సలహా అడగగా, లిప్టులు పెడితే వేల ఎకరాలు సాగులోకి వస్తాయని సర్పంచ్ తెలిపారు. ఆయన సమాధానానికి సీఎం కేసీఆర్ మాట్లాడుతూ అన్ని గ్రామాలకు మీరు చెప్పినట్టు గానే లిఫ్టులు పెట్టి నీళ్లిద్దాం అని తెలిపారు. అయితే ఈ లిఫ్టులు ఎక్కడ పెట్టాలి, వాటిద్వారా ఎన్ని గ్రామాల్లో ఎన్ని ఎకరాలకు నీళ్లివ్వొచ్చు తదితర పూర్తి వివరాలపై మాట్లాడేందుకు హైదరాబాద్ రండి' అని సీఎం సూచించారు. అంతే కాదు వారితో పాటు పనిలో మంచిపట్టున్న ఇంజినీరింగ్ అధికారులను వెంట తీసుకొని రమ్మని పేర్కొన్నారు.