KCR News: సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలు చేయడంపై కేసీఆర్ ఫోకస్
KCR News: దళితబంధు పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి సీఎంఓ కార్యదర్శిగా రాహుల్ బొజ్జా
KCR News: తెలంగాణ సంక్షేమ, అభివృద్ధి పథకాలను మరింత సమర్థవంతంగా అమలు చేయడంపై సీఎం కేసీఆర్ దృష్టిపెట్టారు. ఈ పథకాల అమలుకు ప్రత్యేక చొరవచూపే అధికారులకు ప్రాధాన్యత ఇస్తున్నారు సీఎం. ఇందులో భాగంగా ఇప్పటికే కొందరు ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలు చేపట్టారు. వివిధ శాఖల్లో లాంగ్ స్టాండింగ్‌గా ఉన్న, ఆరోపణలు ఉన్న, పనితీరు సరిగాలేని వారిని బదిలీ చేయాలనీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వ ఇంటిలిజెన్స్ నివేదికలు తెప్పించుకున్నారు.
ఐఏఎస్, ఐపీఎస్‌లకు పదోన్నతులు కల్పించి, కొందరికి స్థాచలనం కూడా కల్పిస్తున్నారు. మూడు నెలలు భువనగిరి కలెక్టర్‌గా ఉన్న అనితారామచంద్రన్ ను బదిలీ చేశారు. ఆమె ప్లేస్ లో భువనగిరి కలెక్టర్ గా పమేల సత్పతి నియామకం చేశారు. ఇక కరీంనగర్ సీపీ కమలాసన్ రెడ్డిని ట్రాన్స్‌ఫర్ చేసింది ప్రభుత్వం. ఆయన్ను డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు. రామగుండం సీపీ సత్యనారాయణను కరీంనగర్ సీపీగా బదిలీ చేసింది సర్కార్. ఇక రామగుండం సీపీగా ఏసీబీ జేడీ రమణకుమార్ ను నియమించింది.
తాజాగా మరో నలుగురు ఐఏఎస్ లను బదిలీ చేసింది ప్రభుత్వం. దళిత బంధు పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి సీఎంఓ కార్యదర్శిగా రాహుల్ బొజ్జాకు పదోన్నతి కల్పించింది. ఎస్ సీ డెవలప్ మెంట్ డిపార్ట్ మెంట్ ను ప్రత్యేకంగా పర్యవేక్షించనున్నారు రాహుల్ బొజ్జా. ఇటీవలే వరంగల్ మున్సిపల్ కమిషనర్ గా ప్రావీణ్యను, జయశంకర్ భూపాలపల్లి జిల్లా అడిషనల్ కలెక్టర్ గా దివాకర టీఎస్‌ను, ఆదిలాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్‌గా రిజ్వాన్ భాషాను బదిలీ చేసింది సర్కార్. దీంతో పాటు ముగ్గురు సీనియర్ ఐఏఎస్ లకు పదోన్నతులు కల్పించింది ప్రభుత్వం.
లెవల్ 17 పే స్కేల్ అమలుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కే.రామకృష్ణరావుకు స్పెషల్ చీఫ్ సెక్రటరీగా, ఏంసీఆర్ హెచ్ఆర్‌డీ అడిషనల్ డీజీ గానే కొనసాగనున్న హరిప్రీత్ సింగ్‌ను స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పదోన్నతి కల్పించింది. అరవింద్ కుమార్ కు స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పదోన్నతి ఇచ్చారు. పోలీస్ శాఖలో భారీగానే బదిలీలు చేపట్టారు ముఖ్యమంత్రి కేసీఆర్. పదోన్నతులు కూడా కల్పించారు. ఇక లేటెస్ట్‌గా సైబరాబాద్ సీపీగా ఉన్న సజ్జనార్‌ను బదిలీ చేసింది సర్కార్. దిశ కేసుతో పాటు పలు కీలక అంశంలో కూడా సజ్జనార్ మంచి పేరు తెచ్చుకున్నారు. లాంగ్ స్టాండింగ్‌గా ఉండటం, ఇంటిలిజెన్స్ నివేదికలు కూడా రావడంతో సజ్జనార్‌ను టీఎస్ఆర్‌టీసీ ఎండీగా బదిలీ చేశారు. ఇక సైబరాబాద్ సీపీగా స్టీఫెన్ రవీంద్రను నియమించారు.