నేడు తెలంగాణ కేబినెట్ భేటీ
* జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై ప్రధాన చర్చ * పట్టభద్రుల కోటాలో జరిగే రెండు ఎమ్మెల్సీ స్థానాలు.. * దుబ్బాక ఉపఎన్నికలో ఓటమిపై చర్చించే అవకాశం * దుబ్బాక ఫలితం తర్వాత తొలిసారి భేటీకానున్న మంత్రిమండలి * హైదరాబాద్‌లో వరదనష్టంపై చర్చించే ఛాన్స్
ఇవాళ సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. త్వరలో జరగనున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికలతో పాటు పట్టభద్రుల కోటాలో జరిగే రెండు ఎమ్మెల్సీ స్థానాలపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. దుబ్బాక ఉపఎన్నిక ఫలితం తర్వాత తొలిసారి మంత్రిమండలి భేటీకానుండటంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. దుబ్బాక ఓటమిపై కూడా ఈ సమావేశంలో సీఎం చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దుబ్బాక ఓటమితో పార్టీపై ప్రజల్లో ఏమైనా వ్యతిరేకత ఉందా అనే కోణంలో కూడా వివరాలను సేకరించనుంది.
మరోవైపు 2016 జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పలు వరాలను ప్రకటించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని ప్రజలకు మంచినీటి వసతి కోసం రెండు రిజర్వాయర్లు నిర్మించేందుకు నిర్ణయం తీసుకుంది. అలాగే.. ఇళ్ల యజమానులకు ఆస్తిపన్నును తగ్గించింది. మరికొన్ని నిర్ణయాలతో అప్పట్లో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు అదే విధానాన్ని అమలుచేయవచ్చని తెలుస్తోంది.
హైదరాబాద్‌లో భారీ వర్షాలు, వరదల వల్ల వచ్చిన నష్టాలపై కేబినెట్‌లో చర్చించనున్నారు. జిల్లాల్లో పంట నష్టాలు, సన్నరకం ధాన్యానికి మద్దతు ధర, కరోనా నేపథ్యంలో ఆదాయాలు తగ్గినందున తీసుకోవాల్సిన చర్యలు, కరోనా కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై మంత్రిమండలిలో చర్చిస్తారని తెలుస్తోంది.