Telangana: నేటి నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు
ఈ ఏడాది రాష్ట్ర బడ్జెట్ 2.50 లక్షల కోట్లు..! సాగు, సంక్షేమ రంగాలకు పెద్దపీట వేసే అవకాశం.
Budget Meetings: నేటి నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 11 గంటలకు అసెంబ్లీ ప్రారంభం కానుండగా.. సభ ఎన్ని రోజులు జరగాలి అనే విషయంపై ఉదయం బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు. కాగా.. రాష్ట్ర బడ్జెట్ ఈఏడాది 2.50 లక్షల కోట్ల నుంచి 2.70 లక్షల కోట్ల వరకు ఖరారు చేసి ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. త్వరలో రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు అనుగుణంగా ఈసారి బడ్జెట్ లో సాగు, సంక్షేమ రంగాలకు పెద్దపీట వేసే అవకాశాలు కన్పిస్తున్నాయి.
ఈ ఏడాది వ్యవసాయ రంగంలో మరో కొత్త పథకాన్ని తీసుకొచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. అదేవిధంగా 57 ఏళ్లు పైబడిన వారికి పింఛన్ల మంజూరీకి నిధులు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. వైద్యానికి పెద్ద మొత్తంలో నిధులు కేటాయింపులు జరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలో 5 కొత్త మల్టీస్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం, జిల్లా వైద్యారోగ్యశాఖ బలోపేతంపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.
ఈ ఏడాది భారీ బడ్జెట్ పై కసరత్తు చేసిన ప్రభుత్వం నిరుద్యోగ భృతికి తప్పకుండా నిధులు కేటాయిస్తుందని సమాచారం. అయితే కనీసం 10 లక్షల మంది నిరుద్యోగులకు ఈ పథకం అమలు చేసినా దీనికోసం వేలాది కోట్ల వరకు కేటాయించాల్సి ఉంటుంది. మరోవైపు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వట్లేదని ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. ఇక సభలో గవర్నర్ ప్రసంగం లేకపోవడంపై కాంగ్రెస్, బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
బడ్జెట్ ప్రసంగం అనంతరం శాసనసభలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలిలో ప్రొటెం ఛైర్మన్ అమీనుల్ జాఫ్రిల అధ్యక్షతన బీఏసీ సమావేశాలు జరుగుతాయి. ఇందులో సమావేశాల ఎజెండా, సభలను ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశాలను నిర్ణయిస్తారు. సంప్రదాయం ప్రకారం బడ్జెట్ ప్రవేశపెట్టిన మరుసటి రోజు సెలవు ప్రకటిస్తారు. దీంతో మళ్లీ బుధవారం నుంచి సమావేశాలు జరిగే అవకాశం ఉంది.