Bandi Sanjay Kumar : తెలంగాణ సీఎం కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గత ప్రభుత్వాల అసంబద్ధ వ్యవసాయ విధానాల వల్లే రైతులకు ఈ కష్టాలని ఆయన అన్నారు. సీఎం కేసీఆర్ కళ్లుండి చూడలేని ముఖ్యమంత్రిలా వ్యవహరిస్తున్నారని అన్నారు. సీఎం కేసీఆర్‌కు కుటుంబ ఆస్తులు పెంచుకోవడంపై ఉన్న శ్రద్ధ రైతుల సంక్షేమంపై లేదని ఆయన ధ్వజమెత్తారు. దేశానికి 1947లో స్వాతంత్య్రం సంవత్సరం వస్తే రైతులకు మాత్రం ఈ సంవత్సరం సెప్టెంబర్ 26న వచ్చిందని తెలిపారు. కేంద్రప్రభుత్వం 6850 కోట్ల రూపాయిలతో వ్యవసాయ ఉత్పత్తుల కల్పనకు ఖర్చు చేయబోతుందని ఆయన అన్నారు.
రాబోయే రోజుల్లో వ్యవసాయరంగ సంస్కరణలపై రైతులకు కలిగే ప్రయోజనాలను తెలియజేసేందుకు పోలింగ్ బూత్ స్థాయిలో ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామని బండి సంజయ్ తెలిపారు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తున్న సీఎం కేసీఆర్.. అసలు ఈ చట్టాలపై రైతుల ఆలోచన సరళి ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేయాలని అన్నారు. వ్యవసాయ బిల్లులను ఎందుకు వ్యతిరేకిస్తున్నారో ప్రజలకు చెప్పకుండా కేసీఆర్ మోసం చేస్తున్నారని ఆరోపించారు. రాబోయే రోజుల్లో సీఎం కేసీఆర్ రైతు ద్రోహిగా చరిత్రలో నిలవనున్నారని వ్యాఖ్యానించారు.
ఇన్నాళ్లు పంట ధర నిర్ణయించే అధికారం రైతుకు లేదని.. ఇప్పడు చెమటోడ్చి పండించిన పంటకు ధర నిర్ణయించేది రైతులే అని తెలిపారు. అయితే విపక్షాలు మాత్రం కావాలని దుష్ప్రచారానికి ఒడిగట్టాయని అన్నారు. మోదీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు తీసుకొచ్చిన ఈ సంస్కరలపై దేశవ్యాప్తంగా రైతుసంఘాలు మద్దతు తెలుపుతున్నాయని బండి సంజయ్ అన్నారు. నూతన వ్యవసాయ విధానానికి నాంది పలికిన ప్రధాని మోదీకి లేఖల ద్వారా కృతజ్నతలు తెలిపే కార్యక్రమం చేపడుతామని వెల్లడించారు. రైతు చట్టాలపై క్షేత్రస్థాయిలో ప్రజలకు వాస్తవాలు వివరిస్తామని అన్నారు.