ముక్కోణపు పోటీతో చీలిన ఓట్లు.. లాభపడ్డ బీఆర్ఎస్.. నష్టపోయిన కాంగ్రెస్
Telangana: ముందు నుంచీ అనుమానిస్తున్నట్టే పలు నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య జరిగిన ముక్కోణపు పోటీ బీఆర్ఎస్కు కలిసొచ్చింది.
Telangana: ముందు నుంచీ అనుమానిస్తున్నట్టే పలు నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య జరిగిన ముక్కోణపు పోటీ బీఆర్ఎస్కు కలిసొచ్చింది. ఆయా చోట్ల ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను బీజేపీ చీల్చడంతో బీఆర్ఎస్అభ్యర్థులు గెలుపొందారు. 2018లో మెజార్టీ స్థానాల్లో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా పోటీ ఉంటే, ఈసారి బీజేపీ నుంచి బలమైన అభ్యర్థులు బరిలో ఉన్న చోట ట్రయాంగిల్ వార్ నడిచింది. దీంతో జగిత్యాల, కోరుట్ల, గద్వాల, సూర్యాపేట, హుజూరాబాద్ లాంటి నియోజకవర్గాల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటును బీజేపీ అభ్యర్థులు భారీగా చీల్చడంతో కాంగ్రెస్ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు.
ఎక్కడెక్కడ ఓట్లు చీలాయంటే..
సూర్యాపేట జిల్లాలో కాంగ్రెస్అభ్యర్థి రాంరెడ్డి దామోదర్‌రెడ్డిపై బీఆర్ఎస్అభ్యర్థి జగదీశ్‌రెడ్డి 5,748 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలిచారు. ఇక్కడ బీఆర్ఎస్అభ్యర్థికి 74,433 ఓట్లు రాగా, కాంగ్రెస్అభ్యర్థికి 68,685 ఓట్లు వచ్చాయి. బీజేపీ నుంచి పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావుకు 40,072 ఓట్లు రావడంతో జగదీశ్‌రెడ్డి గట్టెక్కారు.
జగిత్యాలలో కాంగ్రెస్ అభ్యర్థి టి.జీవన్ రెడ్డిపై 24,822 ఓట్ల మెజారిటీతో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ గెలుపొందారు. ఎమ్మెల్యే సంజయ్‌కి 79,243 ఓట్లు రాగా, జీవన్ రెడ్డికి 54,421 ఓట్లు వచ్చాయి. ఇక్కడ మూడో స్థానంలో ఉన్న బీజేపీ అభ్యర్థి బోగ శ్రావణి ఏకంగా 42,138 ఓట్లు రాబట్టడంతో జీవన్‌రెడ్డి ఓటమిపాలయ్యారు.
ఖైరతాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థి విజయారెడ్డి గెలుపు దాదాపు ఖాయమని అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను బీజేపీ చీల్చడంతో ఆమె ఓటమిపాలయ్యారు. ఇక్కడ గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థి దానం నాగేందర్ కు67,368 ఓట్లు రాగా, విజయారెడ్డికి 45,358 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి 38,094 ఓట్లు రాబట్టడం వల్లే 22,010 ఓట్ల మెజారిటీతో దానం గెలుపొందారు.
కోరుట్లలో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ పై 10,305 ఓట్ల మెజారిటీతో బీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల సంజయ్ గెలుపొందారు. ఇక్కడ సంజయ్ కు 72,115 ఓట్లు, అర్వింద్‌కు 61,810 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థి జువ్వాడి నర్సింగరావుకు 39,647 ఓట్లు వచ్చాయి. ఇక్కడ అర్వింద్బరిలో లేకుంటే నర్సింగరావు గెలిచే అవకాశం ఉండేది.
మహేశ్వరంలో బీజేపీ అభ్యర్థి అందెల శ్రీరాములు యాదవ్ (99,391), కాంగ్రెస్అభ్యర్థి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి (70,657) మధ్య ఓట్లు చీలడంతో 26,187 ఓట్ల మెజారిటీతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి గెలిచారు.
హుజూరాబాద్‌లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కు 63,460 ఓట్లు పోలవ్వగా, కాంగ్రెస్ అభ్యర్థి వొడితల ప్రణవ్ కు 53,164 ఓట్లు వచ్చాయి. ఇక్కడ 80,333 ఓట్లు సాధించిన బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి తన ప్రత్యర్థి ఈటల రాజేందర్ పై 16,873 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు బీజేపీ, కాంగ్రెస్మధ్య చీలడంతో బీఆర్ఎస్ బయటపడింది.