కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. కరోనా వల్ల అనుకున్న సమయం కన్నా ముందే సభను నిరవధికంగా వాయిదా వేశారు. ఈ నెల 28వ తేదీ వరకు అసెంబ్లీని నిర్వహించాలనుకున్నా ఇద్దరు సభ్యులకు, సిబ్బందికి పాజిటివ్ రావడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 7వ తేదీన ప్రారంభమైన సమావేశాలు నేటి వరకు కొనసాగాయి. బీఏసీ కమిటీ సూచనల మేరకు శాసనసభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఈ సమావేశాల్లో కీలకమైన నూతన రెవెన్యూ బిల్లుకు శాసనసభ, మండలి ఆమోదం తెలిపాయి. సమావేశాలు సజావుగా జరిగేందుకు సహకరించిన సభ్యులకు స్పీకర్ పోచారం ధన్యవాదాలు తెలిపారు.