పట్టభద్రుల ఎమ్మెల్సీ ప్రచారంలో దూసుకెళ్తోన్న మల్లన్న
* ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల స్థానానికి పోటీ * సీఎం కేసీఆర్, పల్లా రాజేశ్వర్ రెడ్డిపై విమర్శలు గుప్పిస్తోన్న మల్లన్న * టీఆర్ఎస్ హామీలను నెరవేర్చలేదు- మల్లన్న
పట్టభద్రుల ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అయితే ఈ సారి అందరి దృష్టి ఉమ్మడి నల్గొండ,వరంగల్,ఖమ్మం జిల్లాల ఫట్టభద్రుల స్థానంపైనే ఉంది. ఇక్కడ అధికార పార్టీపై తనదైన శైలిలో విమర్శలు గుప్పిస్తూ దూకుడు నైజం ప్రశ్నించడం కోసమే అంటూ వస్తున్న తీన్మార్ మల్లన్న ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లని, ప్రభుత్వ వ్యతిరేకతను ముందుకు తీసుకెళ్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు.
పట్టభద్రుల ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడ్తుండటంతో తమ ప్రచారాన్ని అభ్యర్థులు వేగవంతం చేశారు. అయితే ఈ సారి హైదరాబాద్ ,రంగారెడ్డి ,మహబూబ్ నగర్ స్థానాలకు పెద్దగా పోటీలేకపోవటంతో అందరి దృష్టి ఉమ్మడి నల్గొండ,వరంగల్,ఖమ్మం స్థానంపైనే పడింది. ఈ స్థానానికి అధికార, ప్రతిపక్ష పార్టీలతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు బలమైన వారే బరిలో దిగటంతో ఈ స్థానంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక తీన్మార్ మల్లన్నగా సుపరిచితులైన నవీన్ కుమార్ ఈ ఎన్నికల్లో సెంటర్ ఆఫ్ ది ఎట్రాక్షన్ గా నిలిచారు.
తనదైన శైలిలో ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపుతూ ప్రజలలో ఒక ప్రత్యేక సాధించుకున్నారు తీన్మార్ మల్లన్న. తెలంగాణ ఉద్యమం నుండి నేటి వరకు ప్రజా సమస్యలపై స్పందిస్తూ ప్రజా వ్యతిరేక విధానాలపై గళమెత్తుతూ అందరి దృష్టి ఆకర్షించారు. అయితే గతంలో ఎమ్మెల్సీ, హుజూర్ నగర్ ఉపఎన్నికల్లోనూ బరిలోకి దిగిన మల్లన్న.. ప్రస్తుతం ఉమ్మడి నల్గొండ,వరంగల్,ఖమ్మం జిల్లాల ఫట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.
తన ప్రచారం సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో 1650 కిలోమీటర్ల పాదయాత్ర చేయగా మల్లన్నకు అడుగడుగా అపూర్వ స్సందన లభించింది. పాదయాత్రలో వచ్చిన స్పందనపై మల్లన్న సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే రాష్ట్రం సాధించుకున్నా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని ఆవేదన వ్యక్తం చేశారాయన. టీఆర్ఎస్ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని విమర్శించారు. వరంగల్ జిల్లాలో ఏ మాత్రం అభివృద్ధి జరగలేదన్నారు. వరంగల్ అభివృద్ధిపై చర్చకు సీఎం కేసీఆర్ సిద్ధమా అని సవాల్ విసిరారు.
ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఓట్లు అడిగే అర్హత లేదన్నారు మల్లన్న. 14 లక్షల ఉద్యోగాలిచ్చామని చెబుతున్న రాజేశ్వర్ రెడ్డి.. అది నిజమని నిరూపిస్తే పోటీ నుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు. ఇక తానిచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రయత్నిస్తానన్న మల్లన్న విఫలమైతే రెండున్నరేళ్లలో ప్రజా రెఫరెండంకు సిద్ధంగా ఉంటానన్నారు. ప్రభుత్వ అన్యాయాలను ఎదిరించటానికి ప్రశ్నించే గొంతుకలా మీ ముందుకు వస్తున్నానని గ్రాడ్యుయేట్ ఓటర్లు తనకు ఒక్క అవకాశం ఇచ్చి చూడాలని కోరారు.
ఇక ప్రశ్నించే గొంతుకలను అణిచివేసే ప్రయత్నం టిఆర్ ఎస్ ప్రభుత్వం చేస్తుందని మల్లన్న విమర్శిస్తున్నారు. తనపై అక్రమకేసులు బనాయిస్తూ తనని తన కుటుంబసభ్యుల్ని వేధిస్తున్నారని మల్లన్న మండిపడ్తున్నారు. అయితే ప్రభుత్వ బెదిరింపులకు తాను భయపడబోనన్న మల్లన్న తనకు అవకాశం ఇస్తే ప్రభుత్వ అసమర్థ విధానాలపై పోరాటం చేసి ప్రజల హక్కులను సాధించి తీరుతానని భరోసా ఇస్తున్నారు.