తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ మహమ్మారి విజృంభిస్తోంది. ఇది వరకు ఎన్నడూ లేని విధంగా అత్యదికంగా కేసులు నమోదు అవుతున్నాయి. ఐతే కరోనా వచ్చి తగ్గిన తర్వాత గుండె సమస్యలు, పక్షవాతం, ఊపిరితిత్తుల్లో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు బయట పడుతున్నాయి. కాబట్టి ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
రాష్ట్రంలో ప్రతిరోజూ 2 వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. గతంలో భయపడిన దానికి భిన్నంగా ఇప్పుడు జరుగుతోంది. కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతున్న దశలో పదేళ్లలోపు పిల్లలు, వృద్ధులపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంచనా వేసిన సంగతి తెలిసిందే. అయితే మనదేశంలో ఇప్పుడు పిల్లలు, వృద్ధులపై కోవిడ్ ప్రభావం తగ్గి, 35–60 ఏళ్ల లోపున్న వారిపై, ముఖ్యంగా పురుషులపై దీని ప్రభావం ఎక్కువ ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.
ఏ వైరస్ అయినా ఒకసారి వచ్చి తగ్గిపోయాక పర్యావరణంలో ఉండిపోతుంది. వ్యాధి నిరోధక శక్తి తగ్గిన వారికి ఇది మళ్లీ సోకే అవకాశాలుంటాయి. అందువల్ల కరోనా వైరస్‌తో సహజీవనం చేయాల్సిందే అంటూ ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు వైద్యులు సూచిస్తున్నారు. గతంలో 2008లో తీవ్రంగా వచ్చిన స్వైన్‌ఫ్లూ వల్ల మరణాలు ఎక్కువగా నమోదయ్యాక, తర్వాతి సంవత్సరాల్లో కూడా ఆ కేసులు తక్కువగానైనా బయటపడుతున్నాయి. అందు వల్ల కరోనా వ్యాప్తిపై అధికంగా అందోళన చెందాల్సిన అవసం లేదంటున్నా, తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది.
ఇక కోవిడ్ వచ్చి తగ్గిన 2, 3 నెలల తర్వాత గుండె సమస్యలు, పక్షవాతం, ఊపిరితిత్తుల్లో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లతో కొందరు మళ్లీ ఆసుపత్రుల్లో చేరుతున్నారు. ఈ పరిస్థితిని డాక్టర్లు 'లాంగ్ కోవిడ్'గా అభివర్ణిస్తున్నారు. వైరస్ పూర్తిగా నిర్వీర్యం కాకపోవడం, ఆలస్యంగా చికిత్స తీసుకోవడం దీనికి ప్రధాన కారణం అని తెలుస్తుంది. వైరల్ లోడ్ ఎక్కువగా ఉన్నవారిలో 'లంగ్ ఫైబ్రోసిస్' వంటి సమస్యలు ఏర్పడుతున్నయని వైద్యులు అంటున్నారు.
కోవిడ్ ను నిర్మూలించే వాక్సిన్ లు ఈ డిసెంబర్ నాటికి అందుబాటులోకి వచ్చే సూచనలు కనిపించడం లేదు. వచ్చినా దాని వల్ల 50, 60 శాతం రక్షణ ఉండొచ్చు. వ్యాక్సిన్ ఒక నివారణగా మాత్రమే పనిచేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. ఇక దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరగడానికి మూడు కారణాలు ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పరీక్షల సంఖ్య పెరగడం, ఆర్థిక కార్యకలాపాలు పునఃప్రారంభం కావడం, తగ్గిపోతుందిలే అన్న భావన ప్రజల్లో కలగడం వల్లనే వ్యాధి విజృంభిస్తున్నట్టు చెప్పారు.