టీపీసీసీ అధ్యక్ష ఎంపికపై కాంగ్రెస్ నేతల్లో ఉత్కంఠ.. రేసులో ప్రధానంగా ఆ ముగ్గురి పేర్లు..
తెలంగాణ కాంగ్రెస్ నూతన సారథి ఎంపిక ఆ పార్టీ నేతల్లో ఉత్కంఠ రేకెత్తిస్తోంది. అధిష్ఠానం ఎవరిని ఎంపిక చేస్తుందని కాంగ్రెస్ నేతలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటు కాంగ్రెస్ అధిష్ఠానం కూడా టీపీసీసీ అధ్యక్షుడి ఎంపికపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మాణికం ఠాగూర్ 200 మంది నేతలను సంప్రదించి ఓ నివేదిక రూపొందించారు. అయితే అన్ని అర్హతలు ఉన్నవారికే టీపీసీసీ అధ్యక్షుడి బాధ్యతలు అప్పగించాలని నేతలు మాణికం ఠాగూర్‌ను కోరినట్లు తెలుస్తోంది.
టీపీసీసీ రేసులో ప్రధానంగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్లు వినిపిస్తున్నాయి. ఇక, పార్టీలో సీనియర్ నేతకు, పార్టీతో సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుడికి టీపీసీసీ అధ్యక్షుడిగా నియమించాలని చాలా మంది కాంగ్రెస్ నేతలు మాణికం ఠాగూర్‌ను కోరినట్టు తెలుస్తోంది. మరోవైపు మాజీ ఎంపీ మధుయాష్కి, కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ లాంటి నేతలు సైతం టీపీసీసీ అధ్యక్షుడిగా తమకు అవకాశం కల్పించాలని అధిష్టానాన్ని కోరుతున్నారు.
టీపీసీసీ పీఠంపై ఆశలు పెట్టుకున్న పలువురు నేతలు ఢిల్లీ వెళ్లి తమ ప్రయత్నాలను ముమ్మరం చేయాలని భావిస్తున్నారు. ఈక్రమంలోనే పార్టీ పెద్దలను కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటు అధిష్ఠానం కూడా పలువురు నేతలను ఢిల్లీకి పిలిపించి మాట్లాడనున్నారు. పీసీసీ పదవీని అధిష్టానం ఎవ్వరికిచ్చినా తాను సహకరిస్తానని జానారెడ్డి అన్నారు. తనకు పదవిపై ఎలాంటి ఆసక్తి లేదని స్పష్టంచేశారు. అయితే రేవంత్ రెడ్డి మాత్రం పీసీసీ పదవిని తనకు అప్పగిస్తే వెంటనే పాదయాత్ర చేపడతానని అన్నారు. తెలంగాణలోని ప్రతి ఇంటికి వెళ్లి కలుస్తానని చెప్పారు. తెలంగాణ సమాజానికి చాలా సేవ చేయాల్సిన బాధ్యత తనపై ఉందని రేవంత్ రెడ్డి అన్నారు.
అయితే రేవంత్‌రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా ఎంపిక చేయకూడదని కాంగ్రెస్‌లోని ఓ వర్గం కొత్త వాదనను తెరపైకి తీసుకువచ్చింది. పార్టీని నమ్ముకొని కృషి చేసిన పాత వారికే పదవి కట్టబెట్టాలని కోరుతున్నారు. లేదంటే పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని హెచ్చరిస్తున్నారు. అందరికి అమోదయోగ్యమైన నాయకుడిని ఎంపిక చేయడంతో పాటు ఆశావాహులను సంతృప్తి పరచాల్సిన బాధ్యత కాంగ్రెస్ అధిష్టానంపై ఉంటుంది. అలా జరగకుంటే పార్టీ విడటానికి కూడా వెనకడరని తెలుస్తోంది.