Nizamabad: మొన్న గవర్నమెంట్ టీచర్‌గా ఎంపిక చేశారు.. నిన్న సారీ అంటూ తీసేశారు..
Nizamabad: మొన్న గవర్నమెంట్ టీచర్‌గా ఎంపిక చేశారు - నిన్న సారీ అంటూ తీసేశారు. విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా డీఎస్‌సీ - 2024లో ఎంపికల్లో గందరగోళం ఏర్పడింది.
Nizamabad: మొన్న గవర్నమెంట్ టీచర్‌గా ఎంపిక చేశారు - నిన్న సారీ అంటూ తీసేశారు. విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా డీఎస్‌సీ - 2024లో ఎంపికల్లో గందరగోళం ఏర్పడింది. ఓ మహిళను టీచర్ ఉద్యోగంలో నియమిస్తూ అపాయింట్ మెంట్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత తమ వద్ద టెక్నికల్‌గా జరిగిన పొరపాటు మూలంగా ఇచ్చిన ఉద్యోగం నుంచి తొలగిస్తూ టర్మినేషన్ లెటర్ ఇచ్చిన ఘటన నిజామాబాద్ జిల్లాలో చర్చనీయంశంగా మారింది. జిల్లాలో ఓ ఉపాధ్యాయురాలిని అనర్హురాలిగా పేర్కొంటూ ఉద్యోగం నుంచి తొలగించిన సంఘటన సంచలనంగా మారింది.
డీఎస్‌సీ - 2024లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థుల్లో మెరిట్ ఆధారంగా జరిపిన ఎంపికల్లో గందరగోళం కొనసాగుతోంది. నిజామాబాద్ జిల్లాలో అర్హత లేదని టీచర్‌గా ఎంపిక చేశారంటూ ఆలస్యంగా విద్యాశాఖ గుర్తించింది. నిజామాబాద్ జిల్లాలో ఓ ఉపాధ్యాయురాలిని అనర్హురాలిగా పేర్కొంటూ అధికారులు ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు టర్మినేషన్ ఉత్తర్వులిచ్చారు. ఎస్‌జీటీ తెలుగు మీడియంలో 257వ ర్యాంకు సాధించిన ఉట్నూర్ లావణ్యకు నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం దుబ్బాక వడ్డెర కాలనీలోని ప్రాథమిక పాఠశాలలో పోస్టింగ్ ఇచ్చారు.
గత నెల 16న బాధ్యతలు చేపట్టిన ఉపాధ్యాయురాలు 23 రోజుల పాటు విధులు నిర్వర్తించారు. కాగా సాంకేతిక కారణాలతో పొరపాటున లావణ్య ఉద్యోగానికి ఎంపిక అయ్యారని, సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరైన 125వ ర్యాంకు అభ్యర్థి భార్గవి గైర్హాజరైనట్లు చూపడంతో ఇలా జరిగిందని విద్యాశాఖ అధికారులు అంటున్నారు. విద్యాశాఖ అధికారుల తప్పిదాన్ని గుర్తించి సరిచేసి లావణ్యను విధుల్లో నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు ఇచ్చామన్నారు.
దీంతో బాధితురాలు ప్రభుత్వం తనకు న్యాయం చేయాలంటూ ఉన్నతాధికారులకు, ప్రజాప్రతినిధులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలు లావణ్య కన్నీటి పర్యంతమై, తనకు ఉద్యోగం వచ్చిందన్న ఆనందం అంతలోనే ఆవిరైందని కన్నీరు పెట్టుకున్నారు. ఈ విషయంపై కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు, డీఈఓకు ఫిర్యాదు చేసి తనకు న్యాయం చేయాలని, ఉద్యోగం ఇవ్వాలని కోరారు. ఈ విషయంపై స్పందించిన కలెక్టర్ విచారణకు ఆదేశాలు జారీ చేశారు.
బాధితురాలు లావణ్య పరిస్థితి ఇలా ఉంటే ఇదే జిల్లాలో కొద్దిరోజుల క్రితం దాదాపు ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండలం తొర్లికొండకు చెందిన రచన డీఈడీ, బీఈడీ పూర్తి చేశారు. ఇటీవల నిర్వహించిన డీఎస్‌సీలో స్కూల్ అసిస్టెంట్‌గా భౌతిక శాస్త్రం విభాగంలో 5వ ర్యాంకు, ఎస్‌జీటీ విభాగంలో 60వ ర్యాంకు సాధించింది. కానీ ఎస్‌ఏ విభాగంలో మూడే పోస్టులు ఉండడంతో తనకు వచ్చే అవకాశం లేదని గమనించి ఎస్‌జీటీ పోస్టు ఎంచుకునేందుకు అధికారుల వద్దకు వెళ్లింది.
అధికారులు మాత్రం ఎస్‌సీ రిజర్వేషన్ ఉన్నందున ఎస్‌ఏ పోస్టు వస్తుందని తెలిపారు. దీంతో ఆ యువతి ఎస్‌సీటీ పోస్టుకు నాట్ విల్లింగ్ లేఖ ఇచ్చింది. ఆ తర్వాత ఎస్‌ఏ పోస్టుకు ఎంపికైనట్లు నియమాకపత్రం ఇచ్చారు. దీంతో ఉద్యోగంలో చేరేందుకు డీఈవో కార్యాలయానికి వెళితే, కంప్యూటర్ తప్పిదంతో ఉద్యోగం లేదని అధికారులు సమాధానమిచ్చారు. దీంతో ఒక్కసారిగా ఖంగుతున్న యువతి ప్రజావాణికి వచ్చి కలెక్టర్, డీఈవోకు వినతిపత్రం ఇచ్చారు. తనను ఆదుకోవాలని వేడుకున్నారు.
కాగా విద్యాశాఖ అధికారుల తప్పిదం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతుండడంపై ఆగ్రహం వ్యక్తమవుతుంది. తప్పిదాలు జరగకుండా ముందుగానే చూసుకోవాల్సిన అధికారులు నిర్లక్ష్యం విడనాడాలని విద్యావేత్తలు కోరుతున్నారు. ఇలాంటి ఘటనలపై ఉన్నతాధికారులు విచారణ జరిపి తప్పు చేసిన భాధ్యులను గుర్తించాలని డిమాండ్ వినిపిస్తున్నది. డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆదేశాల ప్రకారం అనర్హులపై చర్యలు తీసుకున్నామని అంటున్నా.. డీఎస్‌సీ నియామకాల్లో అధికారుల బాధ్యతారాహిత్యానికి భాధ్యులుగా గుర్తించాల్సిన అవసరం కనిపిస్తున్నది.