Patnam Narender Reddy: కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఓ లేఖ విడుదల చేశారు. జైలు నుంచి అఫిడవిట్ ఇచ్చిన నరేందర్ రెడ్డి.. పోలీసులు తన పేరుతో ఇచ్చిన కన్ఫెషన్ రిపోర్ట్ తప్పు అని స్పష్టం చేశారు. కేటీఆర్ గురించి కానీ కేసు గురించి కానీ ఎలాంటి స్టేట్‌మెంట్ పోలీసులు తన నుంచి తీసుకోలేదని తెలిపారు. కోర్టుకు వచ్చాక అడ్వొకేట్ అడిగితే రిమాండ్ రిపోర్ట్ ఇచ్చారని.. అందులో ఏముందో తనకు తెలియదన్నారు. ఈ రిమాండ్ రిపోర్టుపై పట్నం నరేందర్ రెడ్డి జైలు నుంచే ఓ లేఖ విడుదల చేయడం ఇప్పుడు సర్వత్రా సంచలనంగా మారింది.
వికారాబాద్ జిల్లాలోని లగచర్లలో కలెక్టర్‌తో పాటు మిగతా అధికారులపై జరిగిన దాడి ఘటన రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనలో రోజుకో సంచలన పరిణామం చోటుచేసుకుంటుండంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. లగచర్లలో కలెక్టర్‌పై దాడి పథకం ప్రకారమే జరిగిందని.. ఈ కుట్ర కోణం వెనుక బీఆర్ఎస్ నేతలు ఉన్నారంటూ సంచలన ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కేటీఆర్, ఇతర ముఖ్య నేతల ఆదేశాలతోనే దాడికి వ్యూహరచన చేసినట్టు పోలీసులు రిమాండ్ రిపోర్టులో తెలిపారు. నరేందర్ రెడ్డి కావాలనే కుట్ర చేశారని.. ముందస్తు ప్రణాళిక ప్రకారమే అధికారులపై దాడికి పాల్పడ్డారని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఈ ఘటనలో కీలకంగా వ్యవహరించిన సురేష్‌కు తరచూ ఫోన్ చేసినట్టు నరేందర్ రెడ్డి అంగీకరించారని రిమాండ్ రిపోర్టులో పోలీసులు తెలిపారు.
ఎమ్మెల్యే హరీష్ రావు జైల్లో ఉన్న పట్నం నరేందర్ రెడ్డిని గురువారం ములాఖత్‌లో కలిశారు. ఈ క్రమంలోనే తనపై రిమాండ్ రిపోర్టు ఏమని ఇచ్చారని అడగగా.. కేటీఆర్ పేరు ప్రస్తావించినట్టుగా పేర్కొన్నారని హరీష్ రావు వివరించినట్టు సమాచారం. దీంతో పట్నం నరేందర్ రెడ్డి ఈ లేఖను విడుదల చేసినట్టు తెలుస్తోంది. లగచర్ల ఘటనలో A1గా ఉన్న పట్నం నరేందర్ రెడ్డిని బుధవారం కొడంగల్ కోర్టులో హాజరుపర్చగా.. న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో నరేందర్ రెడ్డిని చర్లపల్లి జైలుకు తరలించారు.