ఇళ్ల కూల్చివేతలపై సుప్రీం కోర్టు సీరియస్.. హైడ్రాకు సుప్రీం కోర్టు వ్యాఖ్యలు వర్తిస్తాయా?
Supreme Court on Bulldozer Justice and How it is different from HYDRA demolitions: ఒక నిందితుడిపై కేసు విచారణ పూర్తి కాకుండానే ఆయనను దోషిగా పరిగణించి, శిక్షించే అధికారం అధికారులకు లేదు. అందులోనూ నిందితుల ఇళ్లు కూలగొట్టడం, వారి వ్యాపార సముదాయాలు నేలమట్టం చేయడం వంటి పనులు అస్సలే చేయకూడదు. అధికారి తానే జడ్జిగా మారి నిర్ణయాలు తీసుకోకూడదు. అలా చేస్తే అది 'రూల్ ఆఫ్ లా'ను అతిక్రమించడమే అవుతుంది. ఏ నాగరిక సమాజంలోనూ ఇళ్లు కూలగొట్టే సంస్కృతి లేదు.
ఇవి ఇంకెవరో అన్నమాటలు కావు. దేశ అత్యున్నత న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు. సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బి.ఆర్. గవాయి, జస్టిస్ కే.వి. విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం అధికారులు కూల్చివేతలకు పాల్పడడం చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడం కిందకే వస్తుందని స్పష్టం చేశారు. అలాంటి అధికారులపై శాఖాపరమైన విచారణకు ఆదేశించి, చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని తేల్చి చెప్పారు.
ఇంతకీ సుప్రీం కోర్టు ఈ వ్యాఖ్యలు ఎందుకు చేసింది? కోర్టుకు అలా చెప్పాల్సిన అవసరం ఎందుకొచ్చింది? సుప్రీం కోర్టు చేసిన ఈ వ్యాఖ్యలు ఎయే సందర్భాల్లో వర్తిస్తాయి, ఎవరికి వర్తించవు అనే విషయాలన్నీ ఈ డీటెయిల్డ్ స్టోరీలో తెలుసుకుందాం.
ఏ కేసులో సుప్రీం కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది?
కొన్ని రాష్ట్రాల్లో వివిధ నేరాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుల ఇళ్లను బుల్‌డోజర్లతో కూలగొడుతున్నారనే ఆరోపణలున్నాయి. ముఖ్యంగా ఉత్తర్ ప్రదేశ్‌లో ఈ తరహా ఘటనలు ఎక్కువగా జరుగుతున్నట్లు ఆరోపణలొస్తున్నాయి. అక్కడి ప్రతిపక్షాలు కూడా "ఏంటీ బుల్‌డోజర్ జస్టిస్" అని అక్కడి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో జరుగుతున్న ఈ తరహా ఘటనలపై కొంతమంది సుప్రీం కోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. నిందితుడిపై కోర్టులో విచారణ పూర్తి కాకుండానే వారిని దోషులుగా చూస్తూ, వారి ఇళ్లను కూల్చే హక్కు అధికారులకు ఎవరిచ్చారని పిటిషనర్స్ కోర్టుని ఆశ్రయించారు. ఆ పిటిషన్లు అన్నింటిని ఒకే రకమైన సమస్య కింద పరిగణిస్తూ సుప్రీం కోర్టు బుధవారం ఉమ్మడిగా విచారణ చేపట్టింది. ఈ సందర్భంగానే సుప్రీం కోర్టు బుల్‌డోజర్ జస్టిస్ పై కీలక వ్యాఖ్యలు చేసింది.
అసలు సుప్రీం కోర్టు ఏం చెప్పింది?
వివిధ కేసుల్లో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి ఇళ్లు, షాపింగ్ కాంప్లెక్సులను అధికారులు కూలగొట్టడాన్ని సుప్రీం కోర్టు తప్పు పట్టింది. నేరారోపణలు ఎదుర్కొంటున్నారనే ఒకే ఒక కారణంతో, వారు తప్పు చేశారో లేదో అన్నది కోర్టులు తేల్చకముందే అధికారులే నిర్ణయం తీసుకుని చర్యలు ఎలా తీసుకుంటారని కోర్టు ప్రశ్నించింది.
ఆర్టికల్ 21 ప్రకారం అది వారి హక్కు
సామాన్యులకు సొంతిళ్లు అనేది పెద్ద కల. ఆర్టికల్ 21 ప్రకారం అది వారి హక్కు కూడా. ఎన్నో ఏళ్లు కష్టపడితే కానీ నిజం చేసుకోలేని ఆ కలను బుల్‌డోజర్ జస్టిస్‌తో చిదిమేసి వారిని రోడ్డు మీదకు లాగడం చాలా బాధాకరం. చట్ట ప్రకారం చర్యలు చేపట్టకుండా ఒకరి ఇంటిని కూల్చుతున్నారంటే, చూడ్డానికి ఆ దృశ్యం ఎంత బాధాకరంగా ఉంటుందని కోర్టు వ్యాఖ్యానించింది. అలా జరిగే చోట న్యాయానికి చోటు లేనట్లేనని కోర్టు అభిప్రాయపడింది. కానీ న్యాయం మీదే ఆధారపడిన మన రాజ్యాంగంలో అలాంటి దుశ్చర్యలకు తావు లేదని కోర్టు స్పష్టంచేసింది. అధికార దుర్వినియోగానికి పాల్పడే అధికారం రాజ్యాంగం ఎవ్వరికీ ఇవ్వలేదు. అలా ఎవరైనా చేశారంటే, వారిని కోర్టులు చూస్తూ ఊరుకోవు అని సుప్రీం కోర్టు తేల్చిచెప్పింది.
నిందితులకు, దోషులకు అదే న్యాయం వర్తిస్తుంది
వాస్తవానికి ఏదైనా కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న నిందితులకైనా, లేదా తప్పు చేశారని రుజువైన దోషులకైనా రాజ్యంగం పరంగా, అలాగే క్రిమినల్ లా పరంగా కొన్ని హక్కులు ఉంటాయి. ఆ హక్కులను పరిగణనలోకి తీసుకోకుండా ఇలా చేయడం వారి హక్కులను లాగేసుకోవడమే అవుతుందని కోర్టు అభిప్రాయపడింది. ఆమాటకొస్తే, నిజంగా తప్పు చేసిన వారికి కూడా చట్టరీత్యా శిక్షలు విధించే అధికారం కేవలం కోర్టులకే ఉంటాయి కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు ఉండవని కోర్టు తేల్చిచెప్పింది.
ఒకవేళ ఏ అధికారి అయినా అలా చట్టాన్ని అతిక్రమించి ఇలాంటి చర్యలు తీసుకుంటే వారిపై విచారణకు ఆదేశించాల్సి వస్తుందని కోర్టు వ్యాఖ్యానించింది. అంతేకాదు, నిందితులు లేదా దోషుల ఇళ్లను ఎవరో కూలగొడుతుంటే అడ్డుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులది కూడా తప్పే అవుతుందని కోర్టు అభిప్రాయపడింది.
తప్పనిసరి పరిస్థితుల్లో ఏదైనా ఇంటిని కూల్చాలని అధికారులు నిర్ణయించుకున్నట్లయితే, కచ్చితంగా మరో ప్రత్యామ్నాయం లేని పరిస్థితుల్లోనే ఆ పని చేయాల్సి వస్తోందని అధికారులు నిరూపించుకోవాల్సి వస్తుందని కోర్టు గుర్తుచేసింది.
15 రోజుల ముందు షోకాజ్ నోటీసులు తప్పనిసరి
ఒక ఇంటిని లేదా భవనాన్ని అక్రమ కట్టడం అని భావించి ఆ ఇంటిని కూల్చాల్సి వస్తే, అప్పుడేం చేయాలో కూడా కోర్టు సవివరంగా వివరించింది. ఒక ఇంటిని కూల్చడానికంటే ముందుగా 15 రోజులు ఆ ఇంటి యజమానికి షో కాజ్ నోటీసులు ఇవ్వాలి. స్థానిక ప్రభుత్వ నిబంధనల ప్రకారం అంతకంటే ఎక్కువ రోజులు అవకాశం ఇవ్వగలిగే వీలుంటే.. ఆ ఎక్కువ గడువునే ప్రామాణికంగా తీసుకోవాలి.
రిజిస్టర్ పోస్టు ద్వారా నోటీసులు
ఇంటి యజమానికి రిజిస్టర్ పోస్టు ద్వారా నోటీసులు పంపించాలి. అంతేకాకుండా నేరుగా ఆ ఇంటి బయటి గోడలపై కూడా ఆ నోటీసులు అంటించాలి అని కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. నోటీసులు అందిన రోజు నుండే వారికి ఇచ్చిన 15 రోజుల గడువు మొదలవుతుందని కోర్టు గుర్తుచేసింది.
ఆ నోటీసులకు వారు ఇచ్చిన వివరణను పరిగణనలోకి తీసుకోవాలి. అప్పటికీ వారి వాదనలో న్యాయం లేదనిపిస్తేనే కూల్చివేతలకు ఆదేశాలివ్వాలి. అలా ఆదేశాలిచ్చిన తరువాత కూడా వారు సంబంధిత అప్పీలేట్ అథారిటీని ఆశ్రయించే అవకాశం ఇవ్వాలి. చట్ట ప్రకారం ఈ ప్రక్రియ అంతా పూర్తయిన తరువాత కూడా అప్పటికీ ఆ ఇల్లు అక్రమ కట్టడమే అని ఆదేశాలు ఉంటే తప్ప ఎవరి ఇంటిని కూల్చే అధికారం అధికారులకు లేదని కోర్టు వివరించింది.
ఒకవేళ ఇంటి యజమాని అధికారులతో విభేదించకపోతే, వారికి కనీసం ఆ ఇంటిని ఖాళీ చేసే వెళ్లే అవకాశమైనా ఇవ్వాలి. అవేవీ చేయకుండా వచ్చి ఆ ఇంటిని కూల్చేస్తే.. ఓవర్ నైట్లో ఆ ఇంటి మహిళలు, చిన్నపిల్లలు రోడ్డున పడటం చూడ్డానికి ఆనందంగా కనిపించదని కోర్టు అభిప్రాయపడింది.
నోటీసులు ఇచ్చిన తరువాత చేయాల్సిన పనులు
ఇంటి యజమానికి నోటీసులు అందిన తరువాత ఆ సమాచారాన్ని ఈమెయిల్ ద్వారా జిల్లా కలెక్టర్, జిల్లా మెజిస్ట్రేట్ కి చేరవేయాలి. అలాగే వారు కూడా ఆ ఈమెయిల్‌ని అక్నాలెడ్జ్ చేస్తూ ఆటో రిప్లై ఇవ్వాల్సి ఉంటుంది.ఈ తరహా బాధ్యతలను పర్యవేక్షించడానికి జిల్లా అధికార యంత్రాంగం ఒక నోడల్ అధికారిని నియమించాలి. అలాగే ఒక ఈ మెయిల్ ఐడి రూపొందించి దానిని మునిసిపల్ ఆఫీసులు, బిల్డింగ్ రెగ్యులేషన్ సంబంధిత అధికారులకు ఇవ్వాలి. ఇదంతా కూడా నేటి నుండి నెల రోజుల్లోగా పూర్తి చేయాలి అని కోర్టు ఆదేశాలు జారీచేసింది. ఇదంతా కూడా భవిష్యత్‌లో అధికారులకు న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉండటం కోసం చేయాల్సిన పనులుగా కోర్టు సూచించింది.
ఏయే సందర్భాల్లో ఈ రూల్స్ వర్తించవంటే..
అక్రమ కట్టడాల కూల్చివేతల విషయంలో అధికారులు వ్యవహరించాల్సిన తీరుపై కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. అలాగే ఏయే సందర్భాల్లో ఈ రూల్స్ కూల్చివేతలకు వర్తించవు అనే విషయంపై కూడా కోర్టు స్పష్టంగా చెప్పింది. ప్రభుత్వ స్థలాలు, రోడ్లు, ఫుట్‌పాత్‌లు, రైల్వే లైన్ కబ్జాలు, నదులు, చెరువులు, కుంటలు, నాలాలు వంటి ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి కట్టే ఏ నిర్మాణాలకైనా ఈ రూల్స్ వర్తించవు అని కోర్టు స్పష్టంచేసింది. అలాగే ఏదైనా భవనాలను కూల్చివేసేందుకు కోర్టుల నుండి స్పష్టమైన ఆదేశాలు ఉన్న సందర్భంలో కూడా ఈ రూల్స్ వారికి అడ్డం కాబోవు అని సుప్రీం కోర్టు తేల్చిచెప్పింది.
హైడ్రా చర్యలకు కోర్టు ఆదేశాలు వర్తిస్తాయా?
అక్రమ కట్టడాలైనా సరే 15 రోజుల ముందు నోటీసులు ఇచ్చి, వారి వివరణ విన్న తరువాతే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని సుప్రీం కోర్టు వెల్లడించింది. అయితే, ప్రభుత్వ స్థలాలను, నదులు, చెరువులు, కుంటలు, నాలాలను కబ్జా చేసి నిర్మించే కట్టడాలకు మాత్రం ఈ రూల్స్ వర్తించవు అని కోర్టు స్పష్టం చేసింది. ఇప్పటివరకు హైడ్రా కూడా ఇదే వాదన వినిపిస్తోంది. ప్రభుత్వ స్థలాల్లో వెలిసిన అక్రమకట్టడాలనే తాము కూల్చివేస్తున్నట్లు హైడ్రా చెబుతూ వస్తోంది.