కోవిడ్ నిర్మూలనకు వ్యాక్సిన్ రాకపోవడంతో విద్యార్థులు విద్యకు దూరం అయ్యారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆన్లైన్ క్లాసుల్ని ప్రవేశపెట్టి విద్యార్థులకి బోధన అందించాడనికి సిద్ధపడింది. ఈ క్రమంలో విద్యార్థులు ఆన్లైన్ క్లాసుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఓ విశ్లేషణ.
కోవిడ్ పుణ్యమా అని విద్యార్థులు ఇళ్లకే పరిమితమయ్యారు. వాస్తవానికి ప్రతి సంవత్సరం జులై సమయానికి అన్ని పాఠశాలలు తెరవాల్సి ఉండగా ఇప్పటికీ ప్రభుత్వం నుండి అనుమతులు రాలేదు. దీంతో చదువు దూరమవుతోందనే బెంగ ఇటు తల్లిదండ్రుల్లో అటు విద్యార్థుల్లో నెలకొంది. దేశవ్యాప్తంగా అనేక పాఠశాలలు ఆన్లైన్ తరగతులు ప్రారంభించాయి. ప్రభుత్వ పాటశాలల్లో చదివే విద్యార్థులకు ప్రసార మాధ్యమాల ద్వారా తరగతులను నిర్వహిస్తుంటే ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు మాత్రం ఆన్లైన్ తరగతులను నిర్వహిస్తున్నాయి.
చిన్న పిల్లలు మొదలుకొని డిగ్రీ విద్యార్థుల వరకు సెల్ఫోన్ల ద్వారా ఉపాధ్యాయులు బోధించే తరగతులను నేర్చుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఆన్ లైన్ తరగతులు హాజరయ్యేటప్పుడు జాగ్రత్తలు వహించాలని లేకుంటే పిల్లలకు కంటికి సంబంధించిన సమస్యలు తలెత్తుతాయని వైద్యులు అంటున్నారు. ఆన్ లైన్ క్లాసులు గంటల కొద్ది నిర్వహిస్తున్నారు. దాని వల్ల పిల్లలకు రుగ్మతలు వచ్చే ప్రమాదం ఉందని సైకియాట్రిస్టులు హెచ్చిరిస్తున్నారు. వైద్యుల సూచనల్ని, సలహాల్ని పిల్లలు ఆచరించేలా వారి తల్లిదండ్రులు మార్గదర్శకాలను నిర్దేశించాలి. అలాగే సరైన పద్దతిలో పిల్లలు ఆన్ లైన్ విద్యాభ్యాసం చేసేలా ప్రోత్సహించాలి.