హైదరాబాద్‌లో గబ్బురేపుతున్న పబ్ కల్చర్

Hyderabad: తెల్లవార్లూ తెరిచే ఉంటున్న పబ్‌లు

Update: 2022-06-01 06:46 GMT

హైదరాబాద్‌లో గబ్బురేపుతున్న పబ్ కల్చర్

Hyderabad: సిటీలో పబ్స్ మాటున జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలపై అనేక ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. బంజారాహిల్స్ ఫుడింగ్ అండ్ మింక్ పబ్‌లో జరిగిన రేవ్ పార్టీ వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. అయితే ఆ ఘటన తరువాత కొంతకాలం గ్యాప్ ఇచ్చిన పబ్స్ నిర్వాహకులు.. మళ్లీ యథావిధిగా తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. కొందరైతే బార్ అండ్ రెస్టారెంట్లను కూడా పబ్స్‌గా మార్చేస్తూ యువతుల అర్ధనగ్న నృత్యాలతో న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు. వరుసగా వెలుగు చూస్తున్న ఈ తరహా ఘటనలు హైదరాబాద్‌లో కలకలం సృష్టిస్తున్నాయి.

అర్ధరాత్రిళ్లు డీజే సౌండ్స్‌తో అమ్మాయిల అశ్లీల నృత్యాలతో న్యూసెన్స్ క్రియేట్ చేస్తారు. గంటగంటకు రేట్లు పెంచుతూ లక్షల్లో దండుకుంటారు. విదేశీ యువతులతో క్యాబరేలు ఏర్పాటు చేసి కస్టమర్ల నుండి అందినకాడికి దండుకుంటారు. పైకి కాఫీ షాపులు, బార్ అండ్ రెస్టారెంట్ల పేరుతో చలామణి అవుతూ నిబంధనలకు విరుద్దంగా పబ్స్ నడుపుతున్న వ్యవహారాలు ఈ మధ్య వెలుగు చూస్తున్నాయి.

పబ్స్ మాటున జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలకు మాత్రం అడ్డూ అదుపు లేకుండా పోతుంది. డ్రగ్స్‌తో పాటు అశ్లీల నృత్యాలు ఇక్కడ కామన్. పబ్స్‌లో సాగుతున్న అసాంఘిక కార్యకలాపాల్లో దిగువ, మధ్యతరగతి, దేశ, విదేశీ యువతులతో చేయించే క్యాబరేలు నయా ట్రెండ్‌గామారాయి. కస్టమర్లను ఆకట్టుకోవడానికి నిర్వాహకులు ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు తెర తీస్తున్నారు. వివిధ మెట్రో నగరాలకు చెందిన యువతలతో పాటు టూరిస్టు వీసాలపై విదేశీ యువతుల్ని నగరానికి తెస్తున్న దళారులు.. పబ్స్, రిసార్ట్స్‌లో వారి చేత అర్ధనగ్న నృత్యాలు చేయిస్తూ కాసులు దండుకుంటున్నారు.

అయితే పబ్స్ నిర్వాహకులు తీసుకువస్తున్న విదేశీ యువతుల్లో రష్యాతో పాటు ఉక్రెయిన్, ఉజ్బెకిస్తాన్, ఇతర సోవియట్‌ యూనియన్‌ దేశాలకు చెందిన వాళ్లే ఎక్కువగా ఉంటున్నారు. ఆయా దేశాల్లోని ఆర్థిక పరిస్థితుల్ని ఆసరాగా చేసుకుంటున్న కొందరు దళారులు అక్కడి యువతులకు డబ్బు ఎరవేస్తున్నారు. వారిని టూరిస్టు వీసాలపై ఇక్కడకు రప్పిస్తున్నారు. ఇక విదేశీ యువతుల నృత్యాలకు ఉన్న క్రేజ్‌ను క్యాష్ చేసుకుంటున్న నిర్వాహకులు గంటకు 50 వేల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం.

ఇటీవల రామ్‌గోపాల్‌ పేటలో టెకీల పేరుతో కేఫ్‌ అండ్‌ బార్‌ ఏర్పాటు చేశాడు. అయితే ఎలాంటి అనుమతులు లేకుండా దీన్ని పబ్‌గా మార్చేశారు. అది చాలదన్నట్లు డ్యాన్స్‌, బార్‌, యువతులతో అభ్యంతరకర నృత్యాలు చేయిస్తూ క్యాబరేలు నడుపుతున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న సెంట్రల్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు గత ఆదివారం తెల్లవారుజామున దాడి చేశారు. నిర్వాహకులు, కస్టమర్ల సహా మొత్తం 18 మందిని అరెస్టు చేశారు.

రష్యన్‌ యువతులతో అర్దనగ్న డ్యాన్స్‌లతో అర్ధరాత్రి హంగామా సృష్టించిన ఓ పబ్‌పై జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబరు 36లో ఎనిగ్మా పేరుతో ఒక రెస్టారెంట్, పబ్‌ను ప్రారంభించారు. ప్రీలాంచింగ్‌ అంటూ ప్రారంభించిన ఈ పబ్‌లో రష్యన్‌ యువతులతో నృత్యాలు ఏర్పాటు చేశారు. రెండు రోజులపాటు నిర్వహించే ఈ వేడుకలకు ఎక్సైజ్ శాఖ నుంచి అనుమతులు తీసుకున్న పబ్‌ నిర్వాహకులు.. పోలీసుల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. ఇక యువతుల అశ్లీల నృత్యాలతో పాటు పబ్ వెళ్లే దారిలో భారీగా ట్రాఫిక్ జామ్‌లు కావటంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పబ్ నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

పబ్స్ వ్యవహారాల్లో కొందరు పోలీసుల తీరుపైనా విమర్శలు వ్యక్తమయ్యాయి. కొందరు చూసీచూడనట్లుగా నిర్లక్ష్యంగా వ్యవహరించటం వల్లే పబ్స్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయన్న ఆరోపణలున్నాయి. దీనిపై ఉన్నతాధికారులు సీరియస్‌గా ఉన్నారు. పుడ్ అండ్ మింక్ పబ్ వ్యవహారం తరువాత అప్పటి బంజారాహిల్స్ ఇన్స్‌పెక్టర్ శివచంద్రను సస్పెండ్ చేసిన సీపీ సీవీ ఆనంద్.. క్లబ్‌ టెకీల వ్యవహారంలో రామ్‌గోపాల్‌‌పేటలో ఇన్‌స్పెక్టర్‌ సైదులుపై బదిలీ వేటు వేశారు. అయితే పబ్స్‌పై నిఘా కొనసాగుతుందని అనుమతులు లేకుండా పబ్స్ నిర్వహించినా నిబంధనలు ఉల్లంఘించినా చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Tags:    

Similar News