Steel Bridge: హైదరాబాద్‌లోనే అత్యంత ఎత్తులో నిర్మించిన ఫ్లై ఓవర్.. వీఎస్టీ నుంచి ఇందిరా పార్క్ వరకు స్టీల్ బ్రిడ్జ్
Steel Bridge: ఈ ఫ్లై ఓవర్ ప్రారంభంతో ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద ట్రాఫిక్ కు చెక్
Steel Bridge: నగరంలోనే అత్యంత ఎత్తులో నిర్మించిన ఫ్లై ఓవర్ అందుబాటులోకి రానుంది. ఇందిరా పార్క్ నుండి వీఎస్టీ వరకు 450 కోట్ల వ్యయంతో 2.6 కిలో మీటర్ల పొడవున నిర్మించారు. గ్రేటర్ హైదరాబాద్ లో పెరుగుతున్న జనాభాతో పాటుగా వాహనాల వినియోగం పెరగడంతో ట్రాఫిక్ కష్టాలు పెరిగిపోయాయి. ఈ ఫ్లై ఓవర్ అందుబాటులోకి రావడం ద్వారా ఈ ప్రాంతంలో ట్రాఫిక్ కష్టాలు దాదాపుగా తీరనున్నాయి. ఇందిరా పార్కు నుండి వీఎస్టీ వరకూ నిర్మించిన ఈ స్టీల్ బ్రిడ్జి 20వ ఫ్లై ఓవర్ గా అందుబాటులోకి రానుంది.
ఇప్పటి వరకూ 19 ఫ్లైఓవర్ లు, 5 అండర్ పాస్ లు, 7 ఆర్.ఓ.బి/ఆర్.యు.బిలు, 1 కేబుల్ స్టయిడ్ బ్రిడ్జి, పంజాగుట్ట స్టీల్ బ్రిడ్జి, పంజాగుట్ట రోడ్డు వెడల్పు పనులు పూర్తయ్యాయి. ఎస్ఆర్డీపీ చేపట్టిన పనులలో ఇందిరా పార్కు నుండి వీఎస్టీ వరకు నిర్మించిన ఫ్లై ఓవర్ స్టీల్ బ్రిడ్జితో 36 పనులు పూర్తి కాగా... అందులో 20వ బ్రిడ్జిగా ఇది అందుబాటులోకి రానుంది. ఇందిరా పార్క్ నుండి వీఎస్టీ వరకు 2.6 కిలో మీటర్ల పొడవున్న ఈ ఫ్లై ఓవర్ 450 కోట్ల వ్యయంతో చేపట్టిన మొట్ట మొదటి స్టీల్ ఫ్లై ఓవర్ గా నిలవనుంది. మిగితా ఫ్లై ఓవర్ ల కంటే భిన్నంగా దీన్ని మొత్తం స్టీల్ తో నిర్మించారు. ఇక నగరంలో అత్యంత ఎత్తులో నిర్మించిన ఈ ఫ్లై ఓవర్.... మొదటిసారి మెట్రో బ్రిడ్జిపై నుండి చేపట్టడం జరిగింది. క్రాస్ రోడ్డు వద్ద 26 మీటర్లకు పైగా ఎత్తులో ఈ ఫ్లై ఓవర్ ని నిర్మించారు. ఈ ఫ్లై ఓవర్ అందుబాటులోకి వస్తుండటం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇందిరా పార్కు నుండి వీఎస్టీ వరకు 2.62 కిలోమీటర్ల పొడవున నిర్మాణం జరిగిన ఈ స్టీల్ బ్రిడ్జికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఎలివేటెడ్ కారిడార్ 2.436 కిలో మీటర్లు కాగా అప్ ర్యాంపు 0.106 కి.మీ, డౌన్ ర్యాంపు 0.150 కి.మీ కలదు. రైట్ వే 22.20 మీటర్ల నుండి 36.60 మీటర్లు ఉండగా... ఎలివేటెడ్ కారిడార్ కుడి వైపు మార్గం 4 లైన్ల బై డైరెక్షనల్ ఫ్లై ఓవర్ 16.60 మీటర్లు కలదు. ఫ్లై ఓవర్ వెడల్పు 16.61 మీటర్లు కాగా మొత్తం 81 పిల్లర్లు ఉన్నాయి. స్టీల్ ఫ్లై ఓవర్ మొత్తం 2620 మీటర్ల పొడవు ఉంది. ఈ ఫ్లై ఓవర్ బ్రిడ్జి ద్వారా గ్రేటర్ లో సిగ్నల్ ఫ్రీ రవాణా వ్యవస్థ మెరుగుతో పాటు సకాలంలో గమ్యస్థానానికి చేరే అవకాశం ఉంటుంది. గతంలో గల 4 జంక్షన్ లలో ట్రాఫిక్ ఇబ్బందులు తొలగిపోనున్నాయి. దీంతో ఆర్టీసీ ఎక్స్ రోడ్ వద్ద ట్రాఫిక్ రద్దీకి చెక్ పడనుంది. ఉస్మానియా యూనివర్సిటీ, హిందీ మహా విద్యాలయం వరకు వెళ్లేందుకు ప్రయాణ సమయం తగ్గుతుంది.