Forensic Report Ready : శ్రీశైలం ఘటనపై ఫోరెన్సిక్ నివేదిక సిద్ధం..త్వరలో ప్రభుత్వానికి అందజేత
Forensic Report Ready : గత నెలలో శ్రీశైలం పవర్ ప్లాంట్ లో జరిగిన దుర్ఘటనలో తొమ్మిది మంది మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా ఈ కేసును సీఎం ఆదేశాలతో సీఐడీ చీఫ్ ఏడీజీ గోవింద్ సింగ్ స్వయంగా విచారణ చేపట్టారు. సీఐడీ చీఫ్ ఏడీజీ నిర్వహిస్తున్న ఈ విచారణ మరో ముందడుగు పడింది. ఈ దుర్ఘటన ఏవిధంగా జరిగింది అనే విషయాలను తెలుసుకునేందుకు ఇప్పటికే సీఐడీ ప్రత్యేక బృందాలు పలుమార్లు ఘటనాస్థలాన్ని సందర్శించారు. అయితే ఈ కేసులో ఫోరెన్సిక్ నివేదిక ఏంతో కీలకంగా మారింది. కీలకంగా మారిన ఫోరెన్సిక్ నివేదిక ప్రస్తుతం సిద్ధమైనట్లుగా సమాచారం. సీఐడీ అధికారులు ఈ నివేదికను పరిశీలించిన తరువాత దుర్ఘటనకు అసలు కారణాలేమై ఉంటాయన్న విషయంలో ఓ నిర్ధారణకు రానుంది.
ఇది మానవ తప్పిదం చేత జరిగిందా లేదా, సాంకేతిక లోపంతో జరిగిందా అన్న విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది. వాటిని పూర్తిగా విశ్లేషించిన అనంతరం నివేదిక సిద్ధం చేసినట్లు సమాచారం. ఘటనా స్థలంలో పర్యటించిన సమయంలో ఫోరెన్సిక్ విభాగ నిపుణులు పలు కీలక ఆధారాలు సేకరించారు. మొదట ఈ కేసులో మొదటి నుంచి కుట్ర కోణంపై ఎలాంటి ఆధారాలు లేవు. అయితే సీఐడీ అధికారాలు ఆధారాలు సేకరించి తాను దర్యాప్తులో సేకరించిన అంశాలు, ఫోరెన్సిక్ రిపోర్టులో వెల్లడైన సాంకేతిక అంశాలను ఆధారంగా ప్రాథమిక నివేదిక సిద్ధం చేయనుంది. మరోవైపు ఈ కేసులో ప్రభుత్వం ఏర్పాటు చేసిన మరో నిపుణుల కమిటీ కూడా తన పనిని వేగవంతం చేసింది.