Srisailam: దేవి శరన్నవరాత్రులకు ముస్తాబవుతున్న శ్రీశైలం క్షేత్రం
Srisailam: విజయదశమి రోజు ఆలయ పుష్కరిణిలో తెప్పోత్సవం
Srisailam: శ్రీశైల క్షేత్రం శరన్నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబవుతోంది. ఈనెల 15 నుండి 24 వరకు ఉత్సవాలు జరగనుండగా.. అందుకు సంబంధించిన ఆహ్వాన పత్రికను విడుదల చేశారు ఈవో పెద్దిరాజు. నవరాత్రులకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. దసరాకు వచ్చే భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం, వసతి కల్పిస్తామని తెలిపారు. ఉత్సవాల సమయంలో కుంకుమార్చన, అభిషేకాలు, కళ్యాణోత్సవం యథావిధిగా కొనసాగిస్తామన్నారు. ఈ నెల15న ఉదయం శ్రీస్వామివారి అమ్మవారి యాగశాల ప్రవేశంతో దసరా మహోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు.
దేవీ శరన్నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా తొలిరోజు అమ్మవారికి శైలపుత్రి అలంకారం చేసి.. బృంగివాహన సేవ నిర్వహించనున్నారు. 16న బ్రహ్మచారిణి అలంకారం, మయూరవాహన సేవ.. 17న చంద్రఘంట అలంకారం, రావణవాహన సేవ జరగనుంది. 18న కూష్మాండ దుర్గ అలంకారంలో అమ్మవారు దర్శనమివ్వనుండగా ఆరోజు కైలాసవాహన సేవ నిర్వహిస్తారు. 19న స్కందమాత అలంకారం, శేష వాహన సేవ.. 20న కాత్యాయని అలంకారం, హంస వాహనంపై పుష్పపల్లకిసేవ నిర్వహిస్తారు. 21న కళరాత్రి అలంకారం, గజవాహన సేవ.. 22న మహాగౌరి అలంకారం, నందివాహన సేవ.. 23న సిద్ధిదాయిని అలంకారం, అశ్వవాహన సేవ జరగనుంది. ఈనెల 23న రాష్ట్ర ప్రభుత్వంచే పట్టు వస్త్రాల సమర్పణ ఉంటుంది. విజయదశమి రోజున శ్రీస్వామి అమ్మవారికి నందివాహనంపై ఆలయ ఉత్సవం నిర్వహిస్తారు. శమీవృక్షం దగ్గర పూజలు చేసి.. రాత్రి ఆలయ పుష్కరిణిలో తెప్పోత్సవం నిర్వహిస్తారు. ఈ ఘట్టంతో శరన్నవరాత్రి ఉత్సవాలు ముగుస్తాయి.