శ్రీ‌శైలం విద్యుత్ కేంద్రం ప్ర‌మాదంలో 9 మంది మృతి

Update: 2020-08-21 11:53 GMT

Srisailam Fire Accident: శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో లోపల చిక్కుకున్న తొమ్మిదిమందీ మృత్యువాత పడ్డారు. ఈ మేరకు తెలంగాణ జెన్‌ కో అధికారులు ప్రకటించారు. డీఈ శ్రీనివాస్ గౌడ్ (హైదరాబాద్), ఏఈ వెంకట్‌రావు (పాల్వంచ), ఏఈ మోహన్ కుమార్ (హైదరాబాద్ ), ఏఈ ఉజ్మ ఫాతిమా (హైదరాబాద్), ఏఈ సుందర్ (సూర్యాపేట) ప్లాంట్ అటెండెంట్ రాంబాబు (ఖమ్మం జిల్లా) , జూనియర్ ప్లాంట్ అటెండెంట్ కిరణ్ (పాల్వంచ) హైదరాబాద్‌కు చెందినా అమర్ రాజా బ్యాటరీ కంపెనీ సిబ్బంది వినేష్ కుమార్, మహేష్ కుమార్ చనిపోయినట్టు జెన్‌ కో అధికారులు ప్రకటించారు.

శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్‌ కేంద్రంలో గురువారం రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఒక్కసారిగా విద్యుత్‌ కేంద్రంలో పొగలు అలుముకోవడంతో అధికారులు వెంటనే ఉత్పత్తిని నిలిపివేశారు. మంట‌లు ఆరిపోగా పొగ‌లు మాత్రం ద‌ట్టంగా అలుముకున్నాయి. విద్యుత్ కేంద్రం నుంచి 8 మంది సుర‌క్షితంగా బ‌య‌ట‌కు రాగా మ‌రో 9 మంది అందులోనే చిక్కుకుపోయారు. పవర్ ప్లాంట్ లోపల చిక్కుకున్న 9 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతదేహాలను మార్చరీకి తరలించారు. తమ వారి మృతదేహాలను చూసి బోరున విలపించారు కుటుంబ సభ్యులు. పోస్టు మార్టం తర్వాత మృతదేహాలను బందువులకు అప్పగించేందుకు చర్యలు చేపట్టిన అధికారులు.

Tags:    

Similar News