Bhadrachalam: భద్రాచలంలో శ్రీరామనవమి శోభ.. కన్నులపండువగా శ్రీసీతారాముల కల్యాణోత్సవం
Bhadrachalam: భద్రాద్రిలో కన్నులపండువగా శ్రీసీతారాముల కల్యాణోత్సవం
Bhadrachalam: భద్రాద్రిలో శ్రీరామనవమి శోభ సంతరించుకుంది. భద్రాచల పుణ్యక్షేత్రంలో శ్రీసీతారాముల కళ్యాణోత్సవం కన్నుల పండువగా జరిగింది. మూహూర్త సమయాన సీతమ్మ మెడలో రామయ్య పుస్తె కట్టడంతో కళ్యాణ క్రతువు పూర్తైంది. మిథులా స్టేడియంలోని మండపంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం ఎంతో వైభవంగా జరిగింది. ఉదయం రామాలయంలో మూలవరులకు మొదట కళ్యాణం జరిగింది. ఆపై ఉత్సవమూర్తులను ఆలయం నుంచి మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా మిథులా కళ్యాణ మండపానికి తీసుకొచ్చారు.
సీతారాముల కళ్యాణోత్సవాన్ని ఆలయ ప్రధాన అర్చకులు నిర్వహించారు. ఉదయం 10:30 గంటలకు కళ్యాణోత్సవం ప్రారంభం అవగా.. అభిజిత్ లగ్నంలో సీతారామయ్యలకు రుత్వికులు జీలకర్ర బెల్లం పెట్టారు. ఆపై సీతమ్మ మెడలో రామయ్య మాంగళ్యధారణ చేశారు. తరువాత తలంబ్రాల కార్యక్రమం జరిగింది. అనంతరం జరిగే కార్యక్రమాలను అర్చకులు సంప్రదాయబద్ధంగా పూర్తి చేశారు. రామయ్య కళ్యాణాన్ని కనులారా వీక్షించేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. శ్రీరామనామస్మరణతో మిథులా స్టేడియం మారుమ్రోగింది. భక్తులంతా శ్రీరాముడి కళ్యాణాన్ని వీక్షిస్తూ పరవశించి పోయారు.