Rehabilitation Lands Kabja : నిర్మల్ జిల్లాలో రెచ్చిపోతున్న భూబకాసురులు
Rehabilitation Lands Kabja : వాళ్లు శ్రీరాంసాగర్ జలయజ్ఞ నిర్మాణానికి బాసటగా నిలిచారు. రైతుల కన్నీళ్లు తూడిచే ప్రాజెక్టు కోసం సర్వం త్యాగం చేశారు. అలాంటి త్యాగధనుల కోసం సర్కార్ పునరావాసం కింద భూములు కేటాయించింది. ఆ భూములపై ఇప్పుడు భూ బకాసురుల కన్నుపడింది. రాజకీయ నాయకుల అండ దండలతో దర్జాగా పునరావాస భూముల్లో జెండాలు పాతేశారు. నిర్మల్ జిల్లా పునరావాస భూములను మింగేస్తున్న భూకబ్జా దందాపై హెచ్ఎంటీవీ స్పెషల్ రిపోర్ట్.
నిర్మల్ జిల్లాలో ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఎందరో రైతుల ఇండ్లల్లో సంతోషాన్ని నింపుతోంది. కానీ ఈ ప్రాజెక్ట్ నిర్మాణ సమయంలో ఎన్నో గ్రామాలు సర్వం త్యాగం చేశాయి. వందల ఎకరాలు ముంపునకు గురయ్యాయి. భూములు కోల్పోయిన గ్రామాల కోసం పునరావాస గ్రామాలను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. అందులో భాగంగానే సోన్, మామడ, నిర్మల్ మండలాల్లో పునరావాస గ్రామాలు ఏర్పాడ్డాయి.
ముంపునకు గురైన వ్యక్తుల కోసం సర్కార్ భూములను కేటాయించింది. ఆ భూములను డీ1 భూములు అంటారు. అయితే ఈ భూములపై కొందరి పెద్దమనుషుల కన్నుపడింది. అధికారులతో కుమ్మకై కోట్ల రూపాయల విలువజేసే భూములను పట్టా చేసుకున్నారు. న్యూ పోచంపాడ్ లో సర్వే నెంబర్ 67 లో 9 ఎకరాల 18గుంటల భూమి ఉంది. 44వ జాతీయ రహదారికి సమీపంలో ఈ భూమి ఉండడంతో 20 కోట్లు విలువజేస్తోంది. విలువైన ఈ భూములనే ఇప్పుడు కబ్జాదారులు పట్టా చేసుకున్నారు.
పునరావాసంతో ఎలాంటి సంబంధం లేని వ్యక్తులకు ఎలా పట్టాలు చేశారని గ్రామస్తులు నిలదీస్తున్నారు. ఈ భూమిలో ఉన్న రాజరాజేశ్వరీ ఆలయం, శ్మశాన వాటికను గ్రామానికి కేటాయించాలని గ్రామస్తులు చాలాకాలంగా అధికారులను కోరుతున్నారు. ఇవేమి పట్టించుకోకుండా రాజకీయ పలుకుబడి ఉన్న కొందరు అక్రమార్కులకు ఎందుకు పట్టాలు చేశారని బాధితులు ప్రశ్నిస్తున్నారు.ఇప్పటికే పునరావాసం గ్రామాల్లో 250 ఎకరాలు అక్రమార్కుల పాలయ్యాయి. మరో 2వందల ఎకరాలను మింగేయడానికి కొందరు పెద్ద మనుషులు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఎస్సారెస్పీ అధికారుల నిర్లక్యం. భూకబ్జాదారులకు వరంగా మారిందన్నారు. ఎకరాకు 50వేల నుంచి లక్ష వరకు లంచం ఇచ్చి మరీ పట్టాలు చేసుకున్నట్లు గ్రామాల్లో ప్రచారం జరుగుతోంది. పునరావాస భూముల అన్యాక్రాంతంపై ప్రభుత్వం ఇప్పటికైనా సమగ్ర విచారణ చేపట్టాలని బాధితులు కోరుతున్నారు. అక్రమ పట్టాలను రద్దు చేసి, తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.