Adilabad Highway No.44: ఆ రహదారి స్వర్గసీమను మరిపిస్తోంది. తెలంగాణ కాశ్మీర్ అందాలను మరింత రెట్టింపు చేస్తోంది. కొండలు, కోనలు, ఘాట్లు, లోయల గుండా సాగే ప్రయాణం పర్యాటకులను, ప్రకృతి ప్రేమికులను మంత్ర ముగ్దులను చేస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 44వ జాతీయ రహదారి అందాలపై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రకృతి అందాలకు నిలయం. అందుకే ఈ జిల్లాను తెలంగాణ కాశ్మీర్‌గా పిలుస్తారు. ప్రకృతి అందాల మధ్య ఉన్న 44వ జాతీయ రహదారి స్వర్గసీమను తలపిస్తూ పర్యటకులను, వాహనదారులను ఆకట్టుకుంటోంది. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో నలభై నాలుగవ జాతీయ రహదారి 90 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. సుందరమైన అడవుల గుండా సాగే ఈ రహదారి అందాలు ఎంతసేపు చూసినా తనవి తీరదు. దారి పొడవునా ఉండే పూల చెట్లు పూల బాటను మరిపించేలా వాహనదారులను, ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటున్నాయి.
దట్టమైన అడవులు , కొండలు , కోనలు మధ్య ఈ నేషనల్ హైవే భూతల స్వర్గంలా ఉంటుంది. ఆ కొండలు, కోనల మధ్య ప్రయాణం చేస్తూ ప్రకృతి అందాలను చూసి తన్మయత్వం పొందుతున్నారు ప్రయాణికులు. ఎత్తైనా కొండల్లో ప్రయాణం ఆకాశాన్ని తాకే అనుభూతిని కలిగిస్తుంది. అదే విధంగా ఇక్కడి ఘాట్లు, లోయలు జమ్ముకాశ్మీర్ అందాలను తలపిస్తాయి పచ్చని అడవుల అందాలు, తోరణంలాగా వాహనదారులకు, పర్యాటకులకు స్వాగతం పలుకుతున్నట్లుగా కనిపిస్తుంటాయి.
ఈ రహదారి వెంట పచ్చని ప్రకృతే కాకుండా నేమళ్లు, జింకలు, దుప్పులు సైతం కనిపిస్తుంటాయి. వీటితో పాటు చిన్న చిన్న సేలయేళ్లు, జలపాతాలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి. రహదారిని ఆనుకొని ఉన్న కోరిటికల్ జలపాతం అందాలను సెల్ ఫోన్ లో బంధించి సెల్ఫీ దిగుతుంటారు పర్యాటకులు.