గ్రూప్-1లో వంద మార్కులు సాధించిన వారిపై ప్రత్యేక దృష్టి
* విదేశాల నుంచి వచ్చి పరీక్ష రాసిన వారిపై కూడా దృష్టి పెట్టిన సిట్
TSPSC Paper Leak: పేపర్ లీక్ వ్యవహారం రోజురోజుకూ రాజుకుంటోంది. దీంతో విచారణ ముమ్మరం చేస్తున్నారు సిట్ అధికారులు. తొమ్మిది మంది నిందితులను కస్టడీలోకి తీసుకున్న సిట్ ఇప్పటికే రెండు రోజుల పాటు విచారణ జరిపింది. ఇవాళ నిందితులను ఉమ్మడిగా విచారించాలని భావిస్తోంది. ప్రవీణ్-రాజశేఖర్, రాజశేఖర్-రేణుక, ప్రవీణ్-రేణుకను ఉమ్మడిగా విచారించేందుకు 30 ప్రశ్నలను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
నిన్న ఏడు గంటల పాటు నిందితులను విచారించింది సిట్. విచారణలో కీలక విషయాలను వెల్లడించారు నిందితులు. సిస్టమ్‌లో ఐపీ అడ్రస్ మార్చి ప్రశ్నాపత్రాలు లీక్ చేసినట్లు రాజశేఖర్ అంగీకరించాడు. ఆ ప్రశ్నాపత్రాలను ప్రవీణ్, రేణుక ద్వారా విక్రయించినట్లు తెలిపారు. దీంతో గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో వంద మార్కులకు పైగా సాధించి క్వాలిఫై అయిన వారి జాబితా కూడా సిట్ సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ జాబితాలోని వారితో ప్రవీణ్, రాజశేఖర్ కాంటాక్ట్ అయ్యారా అని.. అందులో ఎవరైనా గ్రూప్ 1 పరీక్షలో క్వాలిఫై అయ్యారా అనే కోణంలో దర్యాప్తు జరపనున్నారు సిట్ అధికారులు. ఇప్పటికే ప్రవీణ్, రాజశేఖర్ ఫోన్ల నుంచి ఆరు నెలల కాల్స్, చాటింగ్ సమాచారాన్ని సేకరించినట్లు తెలుస్తోంది. పేపర్ లీక్ వ్యవహారంలో ఎన్‌ఆర్‌ఐలు కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇద్దరు ఎన్‌ఆర్‌ఐలు పరీక్ష రాసి వెళ్లాక అకస్మాత్తుగా వారి ఫోన్లు స్విచాఫ్ కావడంతో అనుమానాలు వ్యక్తం చేస్తోంది సిట్. వారి పాత్రపైనా విచారణ జరపనుంది.