ఇక్కడ స్మితా సభర్వాల్.. అక్కడ ఆమ్రపాలి.. ఇద్దరికీ ఒకే రకం పోస్టింగ్.. పోటీ తప్పదా?
Smita Sabharwal and Amrapali Kata: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఆ ఇద్దరు మహిళా ఆఫీసర్ల గురించే చర్చ జరుగుతోంది. ఇంతకీ వారిద్దరు ఎవరు? చర్చ ఏంటి అనుకుంటున్నారా? అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. స్మితా సభర్వాల్, ఆమ్రపాలి కాటా ఇద్దరూ తమ పనిలో తమ మార్క్‌ను చూపించుకునే ఆఫీసర్లు. ఎక్కడ పని చేసినా ఎవరి స్టైల్లో వాళ్లు దూసుకుపోతారు. డైనమిక్ ఐఏఎస్ అధికారులుగా పేరు తెచ్చుకున్న ఇద్దరు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. తమకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంటారు. తెలంగాణలో ప్రధాన పోస్టుల్లో పనిచేసిన వీరిద్దరు.. ఇప్పుడు వేరువేరు రాష్ట్రాల్లో ఒకే పోస్టింగ్‌లో ఉండడం విశేషం.
స్మితా సభర్వాల్ 2001 ఆల్ ఇండియా సివిల్ సర్విసేస్ అధికారి. తెలంగాణ ఏర్పడక ముందు పలు జిల్లాల్లో కలెక్టర్‌గా పనిచేసి తనదైన ముద్ర వేసుకున్నారు. ప్రజల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. మెదక్ కలెక్టర్‌గా పనిచేస్తున్న సమయంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం.. ఆ తర్వాత కేసీఆర్ సీఎం కావడంతో.. ఏకంగా సీఎం సెక్రటరీగా సుదీర్ఘ కాలం పనిచేశారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి అధికారంలోకి రావడంతో ఫైనాన్స్ కమిషన్ కార్యదర్శిగా నియమితులయ్యారు.
తాజాగా నవంబర్ 11న 13 మంది ఐఏఎస్ ఆఫీసర్లను ప్రభుత్వం ట్రాన్స్‌ఫర్ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదిలీల్లో భాగంగా స్మితా సభర్వాల్‌కు యువజన సర్వీసులు, టూరిజం అండ్ కల్చరల్ సెక్రటరీగా నియమిస్తూ రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది.
ఇక ఆమ్రపాలి సైతం తెలంగాణలో పనిచేశారు. ఆమె బాధ్యతలు నిర్వహించిన ప్రతీ చోట తనకంటూ ఒక ప్రత్యేక మార్క్ క్రియేట్ చేసుకోగలిగారు. కొత్త కొత్త ఆలోచనలతో ట్రెండింగ్ ఆఫీసర్ అనే పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత జీహెచ్ఎంసీ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టి తనదైన ముద్ర వేసుకున్నారు. ఇటీవల కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులతో తెలంగాణ నుంచి రిలీవ్ అయి ఏపీకి వెళ్లారు.
ఏపీలో రిపోర్ట్ చేసిన ఆమ్రపాలికి టూరిజం ఎండీగా నియమించింది చంద్రబాబు ప్రభుత్వం. అదే టైంలో తాజాగా జరిగిన ఐఏఎస్ బదిలీల్లో స్మితా సభర్వాల్‌కు టూరిజం సెక్రటరీగా తెలంగాణ ప్రభుత్వం బాధ్యతలు అప్పజెప్పింది. ఎప్పుడూ ప్రజల్లో, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఇద్దరు ఆఫీసర్లకు ప్రభుత్వాలు ఒకే బాధ్యతలు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. తమ ట్రెండీ థింకింగ్ స్టైల్‌తో టూరిజాన్ని మరింత అభివృద్ధి చేస్తారని అందరూ భావిస్తున్నారు. టూరిజంలో అక్కడ ఆమ్రపాలి.. ఇక్కడ స్మితా సభర్వాల్ ఇద్దరూ పోటాపోటీగా పనిచేసి మరోసారి తమ మార్క్ చూపించుకుంటారా అని అనే వారు కూడా లేకపోలేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పర్యాటక రంగం అభివృద్ధిలో ఆ ఇద్దరి పాత్ర ఎలా ఉండబోతోందనేది చూడాలి మరి.