Kalyana Lakshmi scheme and Shadi mubarak scheme: కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. ఇప్పటికే కొన్ని పథకాలు అమలవుతుండగా.. మరికొన్నింటిని అమలు చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇంకా అమలుకు నోచుకోని పథకాల్లో కళ్యాణ లక్ష్మి పథకం ఒకటి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కళ్యాణ లక్ష్మి పథకం కింద లక్ష రూపాయల నగదుతో పాటు తులం బంగారం ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. దీంతో ఈ పథకం ఎప్పుడెప్పుడు అమలు చేస్తారా అని ఎంతోమంది ఎదురుచూస్తున్నారు. అయితే త్వరలోనే ఈ పథకం అమలు చేస్తామని ప్రభుత్వంలోని పెద్దలు చెబుతున్నారు. కానీ ఎప్పటి నుంచి అనేది మాత్రం క్లారిటీ ఇవ్వడంలేదు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం కళ్యాణలక్మి పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద లక్ష రూపాయల నగదును పేద ప్రజలకు అందించింది. అయితే కాంగ్రెస్ తాము అధికారంలోకి వచ్చిన వెంటనే లక్ష నగదుతో పాటు తులం బంగారం కూడా ఇస్తామని ప్రకటించింది. కానీ కాంగ్రెస్ ఏడాది పాలన గడిచిపోయినప్పటికీ ఇంత వరకూ కళ్యాణలక్ష్మి , షాదీముబారక్ పథకాలు మాత్రం అమలుకు నోచుకోవడంలేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.
మహిళలకు బంగారం అంటే ఇష్టం కావడంతో వారి బలహీనతను చూసి హామీని ఇచ్చారని అప్పట్లో విపక్షాలు కాంగ్రెస్‌పై విమర్శలు చేశాయి. అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఇంతవరకు దీనిపై ఎలాంటి విధివిధానాలను రూపొందించకపోవడం నిరాశకు గురిచేస్తోందంటున్నారు పేద ప్రజలు.
తులం బంగారం ధర ఇప్పుడు రూ.70 వేలకు పైగానే ఉంది. ఈ లెక్కన ఒక్కో కుటుంబానికి రూ.1 లక్షా 70 వేలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంత పెద్ద మొత్తంలో ఒక్క కుటుంబానికి ఇవ్వాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. అందులోనూ లక్షల సంఖ్యలో వివాహాలు జరిగాయి, జరుగుతున్నాయి. దీంతో ఎప్పుడెప్పుడు ఈ పథకాన్ని అమలు చేస్తారా అని ఆ పథకానికి అర్హులైన లబ్ధిదారులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఈ స్కీమ్ ఎప్పుడు లాంచ్ చేస్తారని విపక్షాలు సైతం నిలదీస్తున్నాయి.
త్వరలోనే ఈ పథకాన్ని కూడా ప్రారంభించాలన్న ప్రయత్నంలో తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ ఉందని సమాచారం. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన పెళ్లిళ్లకు ఈ పథకాన్ని ఇస్తారా? లేక ఫలానా తేదీ నుంచి అయిన వివాహాలకే ఈ స్కీమ్ వర్తిస్తుందా? అన్న దానిపై మాత్రం క్లారిటీ లేదు. ఏది ఏమైనప్పటికీ ఈ పథకాన్ని త్వరగా ప్రారంభించాలని.. అటు ప్రతిపక్షాలు, ఇటు మహిళలు కోరుతున్నారు. చూడాలి మరి ప్రభుత్వం ఈ పథకానికి ఎప్పుడు ముహూర్తం ఫిక్స్ చేస్తుందో.