China Manja: ప్రాణాల మీదకు తెస్తున్న చైనా మాంజా..

సంక్రాంతికి గాలిపటాలు ఎగురవేస్తారు. అయితే దీనికి ఉపయోగించే చైనా మాంజా దారం మనుషుల ప్రాణాలను బలి తీసుకుంటోంది.

Update: 2025-01-02 11:49 GMT

China Manja: ప్రాణాల మీదకు తెస్తున్న చైనా మాంజా..

సంక్రాంతికి గాలిపటాలు ఎగురవేస్తారు. అయితే దీనికి ఉపయోగించే చైనా మాంజా దారం మనుషుల ప్రాణాలను బలి తీసుకుంటోంది. గతంలో దీని వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. గాలి పటాలు ఎగరేసిన తర్వాత అలానే వదిలేస్తుండడంతో రోడ్లపై వెళ్లే వారి మెడలకు చుట్టుకుని ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా మూడ్రోజుల్లో ఏడుగురి ప్రాణాల మీదకు తెచ్చింది ఈ చైనా మాంజా.

సంక్రాంతి పండగను తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకుంటారు. గుమ్మం ముందు రంగుల ముగ్గులు. ఘుమఘుమలాడే పిండి వంటలు. ఇది ఒక వంతు అయితే.. రంగురంగుల పతంగులతో ఆకాశం కూడా అందంగా ముస్తాబైనట్లు కనిపిస్తుంది. రకరకాల పతంగులు నింగిని తాకుతూ ఉంటాయి. గాలిపటాలు నింగిలో ఎగురుతుంటే ఆ ఆనందం అంతా ఇంతా కాదు. అయితే అదే ఇప్పుడు మనుషుల ప్రాణాల మీదకు తెస్తోంది.

గాలిపటానికి ఉపయోగించే చైనా మాంజా దారం ప్రాణాలను బలి తీసుకుంటోంది. ఈ చైనా మాంజాలను నిషేధించినప్పటికీ వాటి విక్రయాలు కొనసానగుతుండడంతో ప్రాణాలు పోతున్నాయి. గతంలో పలువురి ప్రాణాలు తీసిన చైనా మాంజా.. తాజాగా రంగారెడ్డిలో ఇద్దర్ని ప్రమాదంలో పడేసింది. షాద్ నగర్ పరిధిలోని నందిగామ దగ్గర దంపతులు బైక్‌పై వెళ్తుండగా చైనా మాంజా సడెన్‌గా మెడకు చుట్టుకుని భర్త గొంతుకు తీవ్రగాయమైంది. ఆ మాంజాను తీసేందుకు ప్రయత్నించిన భార్య చేతులకు సైతం తీవ్రగాయాలయ్యాయి. దీంతో స్థానికులు ఇరువురిని ఆస్పత్రికి తరలించారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుర్రాయిగూడెంకు చెందిన ఏరువాక కృష్ణారావు బైక్‌పై వెళ్తుండగా.. రామవరం దగ్గర మెడకు మాంజా దారం తగిలింది. దీంతో అక్కడికక్కడే పడిపోయారు. గొంతుకు గాయం కావడంతో తీవ్రరక్తస్రావమైంది. ఆస్పత్రిలో ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.

మూడు రోజుల క్రితం జనగామ జిల్లాలో చైనా మాంజా వల్ల నలుగురు ఆస్పత్రి పాలయ్యారు. జనగామ-సిద్ధిపేట రహదారిపై వెళ్తుండగా గాలిపటం తెగి మాంజా మెడకు చుట్టుకుంది. వారికి గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారు ఆస్పత్రిలో ఉన్నారు. గాయపడ్డవారిలో ఇద్దరు చిన్నారులు ఉన్నారు.

పతంగులు ఎగరేసేందుకు చైనా మాంజా వాడొద్దని.. విక్రయించవద్దని అటు పోలీసులు.. ఇటు అధికారులు హెచ్చరిస్తున్నా.. స్వచ్ఛంద సంస్థలు అవగాహన కల్పిస్తున్నా విక్రయాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. ఫలితంగా కొందరు ప్రాణాలు కోల్పోతుండగా.. మరికొందరు ప్రమాదం అంచులదాక వెళ్లి బయటపడుతున్నారు. అయినా మార్కెట్‌లో చైనా మాంజా విక్రయానికి అడ్డుకట్ట పడడంలేదు. పోలీసులు సోదాలు చేసి కేసులు నమోదు చేస్తున్నా.. కొందరు వ్యాపారులు రహస్యంగా విక్రయాలు కొనసాగిస్తున్నారు.

గతంలో చైనా మాంజాను ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కు సీక్రెట్‌గా తీసుకొచ్చి విక్రయించారు. కొన్నాళ్ల నుంచి లోకల్‌లోనే తయారు చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ చైనా మాంజాను నైలాన్, సింథటిక్ దారానికి గాజు, ప్లాస్టిక్ పొడి పూసి తయారు చేస్తారని సమాచారం. అందుకే ఇది సాధారణ దారం కంటే గట్టిగా పదునుగా ఉంటుంది. గాలి పటాలు ఎగరేసిన తర్వాత అలానే వదిలేస్తుండడంతో రోడ్లపై వెళ్లే వారి మెడకు చుట్టుకుని ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా చైనా మాంజా బ్యాన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

Tags:    

Similar News