MLC Elections 2021: పట్టభద్రుల విచిత్ర విన్యాసాలు
MLC Elections 2021: పిచ్చిగీతలు.. నిర్లక్ష్య రాతలు * రెండు చోట్లా చెల్లని ఓట్లు సరాసరి 6%
MLC Elections 2021: పట్టభద్రుల ఎన్నికల్లో చెల్లని ఓట్ల సంఖ్య విస్మయానికి గురిచేస్తోంది. డిగ్రీ ఉత్తీర్ణులైనా ప్రాధాన్య క్రమంలో అభ్యర్థులకు ఓటు వేయలేని వారు సగటున 6 శాతం ఉండటం గమనార్హం. బ్యాలెట్ పత్రాలపై పిచ్చి గీతలు గీసి, ఇష్టమొచ్చిన రాతలు రాసి చాలా మంది నిర్లక్ష్యం చూపారు.
బ్యాలెట్ పేపరుపై మొదటి నాలుగు వరుసల్లో ఓ వ్యక్తి '4' సంఖ్య రాశాడు. అది చూసి నాలుగో స్థానంలోని తెరాస అభ్యర్థికి ఓటు వేయమని చెబితే అభ్యర్థి ఫొటోకు ఎదురుగా '4' సంఖ్య రాశాడేమోనని సిబ్బంది నవ్వుకున్నారు. చెల్లని ఓట్లలో అత్యధికం టిక్కు మార్కులే కనిపించాయి. నచ్చిన అభ్యర్థుల ఎదురుగా 1, 2 అని రాసి, పక్కన టిక్కు మార్కులు పెట్టారు. అంకెలకు బదులు one, two అని రాసినవారూ ఉన్నారు.
'ఐ లవ్ యూ', 'జై కేసీఆర్', నోటా వంటి రాతలూ కనిపించాయి. ఒకటో ప్రాధాన్యం ఇవ్వకుండా మిగిలిన అంకెలు రాశారు కొందరు. ఇద్దరు, ముగ్గురికి ఒకటో ప్రాధాన్యం ఇచ్చారు మరికొందరు. కొట్టివేతలూ ఉన్నాయి. అంకెల బదులు సంతకాలు చేశారు. కొందరైతే బ్యాలెట్ పేపరును ఖాళీగా వదిలేశారు. కొందరు అభ్యర్థి ఫొటోపై సంతకం, ప్రాధాన్యం తెలిపే సంకేతాన్ని తెలుగు, ఆంగ్లంలో రాయడం వంటి పనులు చేశారు.